ఐపీఎస్ అధికారి కాఠిన్యం.. కానిస్టేబుల్ నోటికాడి బుక్క‌ను అడ్డుకున్న వైనం

ఓ ఐపీఎస్ అధికారి ఓ పోలీసు కానిస్టేబుల్ ప‌ట్ల అమాన‌వీయంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆక‌లిగా ఉండ‌టంతో అన్నం తినేందుకు సిద్ధ‌మైన కానిస్టేబుల్ నోటికాడి బుక్క‌ను అడ్డుకున్నాడు

  • Publish Date - February 15, 2024 / 04:48 AM IST

ల‌క్నో : ఓ ఐపీఎస్ అధికారి ఓ పోలీసు కానిస్టేబుల్ ప‌ట్ల అమాన‌వీయంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆక‌లిగా ఉండ‌టంతో అన్నం తినేందుకు సిద్ధ‌మైన కానిస్టేబుల్ నోటికాడి బుక్క‌ను అడ్డుకున్నాడు ఆ ఐపీఎస్ ఆఫీస‌ర్. తిన‌డానికి రాలేదు.. విధులు నిర్వ‌ర్తించేందుకు వ‌చ్చామ‌ని అనేస‌రికి.. భోజ‌నంతో ఉన్న ప్లేటును చెత్త‌కుప్ప‌లో ప‌డేసి వెళ్లిపోయాడు కానిస్టేబుల్. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అజాంఘ‌ర్‌లో నిన్న చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం మోహ‌న్ యాద‌వ్ యూపీలోని అజాంఘ‌ర్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చారు. దీంతో అజాంఘ‌ర్‌లో పోలీసులు బందోబ‌స్తు క‌ల్పించారు. ఇక సీఎం హాజ‌రైన కార్య‌క్ర‌మం వ‌ద్ద భోజ‌నాలు ఏర్పాటు చేశారు. ఆక‌లిగా ఉండ‌టంతో ఓ సీనియ‌ర్ పోలీసు కానిస్టేబుల్ భోజ‌నం చేద్దామ‌ని అక్క‌డికి వెళ్లాడు. ప్లేట్‌లో భోజ‌నం వ‌డ్డించుకున్నాడు. ఇక తిందామ‌ని అనుకునే స‌రికి అక్క‌డ ఐపీఎస్ అధికారి శుభం అగ‌ర్వాల్ వాలిపోయాడు.

భోజ‌నం తినేందుకు సిద్ధంగా ఉన్న కానిస్టేబుల్ వ‌ద్ద‌కు వెళ్లి.. మ‌నం తిన‌డానికి రాలేదు.. బందోబ‌స్తుకు వ‌చ్చామ‌న్నారు ఐపీఎస్ ఆఫీస‌ర్‌. సీఎం వెళ్లాక తినాల‌ని సూచించేస‌రికి తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ఆ కానిస్టేబుల్‌.. ప్లేట్‌ను డ‌స్ట్ బిన్‌లో ప‌డేసి అటు నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మాన‌వత్వంతో మెల‌గాల‌ని ఐపీఎస్‌కు ప‌లువురు నెటిజ‌న్లు సూచించారు. నోటికాడి బుక్క‌ను అడ్డుకోవ‌డం స‌రికాద‌ని మండిప‌డుతున్నారు.

Latest News