అంతరించిపోతున్న ఖడ్గ మృగాల (North White Rhinoceros) ను రక్షించే అంశంలో శాస్త్రవేత్తలు కీలక పురోగతి సాధించారు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) పద్ధతిలో నార్త్ వైట్ రైనో అండాన్ని సదరన్ వైట్ రైనోలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం నార్త్ రైనో జాతికి చెందిన ఖడ్గమృగాలు రెండు మాత్రమే జీవించి ఉండగా.. ఆ రెండూ అండాన్ని అభివృద్ధి చేసి.. పిల్లలను కనే పరిస్థితుల్లో లేవు. దీంతో శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేసి ఐవీఎఫ్ (IVF) పద్ధతిలో ఎటువంటి పొరపాటూ జరగకుండా చూసుకొని సఫలమయ్యారు, జర్మనీలోని ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కన్సార్టియం బయోరెస్క్యూకు చెందిన పరిశోధకులు ఈ చరిత్రాత్మక ప్రాజెక్టుకు నేతృత్వం వహించారు.
ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన వైట్ రైనో ఎంబ్రియోను.. సదరన్ రైనోలో ప్రవేశపెట్టారు. ఇది ఖడ్గమృగాల అదృశ్యాన్ని అడ్డుకోవడంలో అతి కీలకమైన ముందడుగు అని సుసానే హోల్ట్జ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఇప్పడు తాము చాలా నమ్మకంతో ఉన్నామని..ఈ విధానంలో నార్త్ వైట్ రైనోలను పుట్టించేలా చేయగలమని భావిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఆఫ్రికాలో ఈ నార్త్ వైట్ రైనోలు విరివిగా కనిపించేవి. వలసపాలన సమయంలో దొరలు వీటిని విచ్చలవిడిగా వేటాడటంతో క్రమంగా అంతరించిపోయాయి.
ప్రస్తుత కాలంలో కూడా ప్రపంచవ్యాప్తం ఉన్న ఖడ్గమృగాలను వాటి కొమ్ముల కోసం వేటాడతున్నారు. ఆ కొమ్ముకు ప్రకృతి వైద్యంలో కీలకంగా భావించడమే దీనికి కారణం. ఈ నమ్మకాన్ని చెరిపేయాలనే ఉద్దేశంతోనే మన అస్సాం సహా చాలా ప్రాంతాల్లో చనిపోయిన ఖడ్గమృగాల కొమ్ములను దహనం చేసేస్తారు. ఈ ప్రాజెక్టు విషయానికి వస్తే.. ఇప్పుడు మేము ఏదైతే చేశామో.. అది గతంలో ఎవరి ఊహలకూ అందనిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాము కూడా మొదట ఇది చేయగలమని నమ్మలేదని పేర్కొన్నారు. ‘ముందుగా ఈ విధానాన్ని ఒక దున్నపోతుపై నిర్వహించాం.
మేము ప్రవేశపెట్టిన అండం, సరోగేట్ దున్నపోతు కొన్ని రోజుల్లోనే మరణించాయి. అండంపై బ్యాక్టీరియా దాడి చేయడం, అది దున్నపోతుకు కూడా వ్యాపించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది’ అని గుర్తుచేసుకున్నారు. ఆ దున్నపోతు ఉన్న కొట్టంలో ఉన్న బురదే ఈ బ్యాక్టీరియాకు కారణమని గుర్తించిన శాస్త్రవేత్తలు.. సరోగేట్ రైనో ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా సీల్ చేసి ప్రక్రియను కొనసాగించారు. ఒక గంటపాటు సాగిన ఈ ప్రక్రియలో.. సరోగేట్ రైనోకు మత్తు మందు ఇచ్చారు. ప్రవేశపెట్టిన అండాన్ని బతికున్న రైనో నుంచి తీసుకోగా.. రెండేళ్ల క్రితం చనిపోయిన రైనో నుంచి తీసి భద్రపరిచిన వీర్యాన్ని ఫలదీకరణం కోసం ఉపయోగించారు. మరో రెండు లేదా రెండున్నరేళల్లో తొలి ఐవీఎఫ్ నార్త్ వైట్ రైనో బేబీ జన్మించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ జాతిలో చివరి మగ రైనో సూడాన్.. 2018లో కెన్యాలోని వన్య సంరక్షణ కేంద్రంలో కన్నుమూసింది.