గెలిపిస్తే వరంగల్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను పరిష్కరిస్తాను

గెలిపిస్తే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తానని కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య హామీ ఇచ్చారు

  • Publish Date - April 22, 2024 / 02:23 PM IST

నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కడియం కావ్య
మానుకోట బిజెపి అభ్యర్థి నామినేషన్ దాఖలు

విధాత, వరంగల్ ప్రతినిధి: గెలిపిస్తే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తానని కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా కావ్య మాట్లాడుతూ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపిస్తే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరే విధంగా విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వరంగల్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి గడిచిన 10ఏళ్లలో బీజేపీ చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలు గమనించాలని కోరారు.

రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను సైతం అమలు చెయకుండా రాష్ట్రానికి మొండి చేయు చూపిన బీజేపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ప్రజలు, మేధావులు, యువత ఆలోచించాలని తెలిపారు. బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ అవినీతి, అక్రమాల చరిత్ర తెలిసిన వర్దన్నపేట ప్రజలు ఎమ్మెల్యేగా తిరస్కరించారాని అలాంటి వ్యక్తిని ఎంపీ గా గెలిపిస్తే వరంగల్ లో అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు రాజ్యమేలుతాయని ఆరోపించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ఏకైక లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

సోమవారం తోలి సెట్ నామినేషన్ ను డాక్టర్ కావ్య దాఖలు చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కేఆర్ నాగరాజు, దొమ్మటి సాంబయ్యతో కలిసి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యలయంలో వరంగల్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యకి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా సీతారాం నాయక్ నామినేషన్

భారతీయ జనతా పార్టీ,(బిజెపి) మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ సోమవారం నాడు, రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Latest News