అవి సాక్సులా.. షూలా? 16 వేలు పెట్టి కొనాలా?.. ఓ సెల‌బ్రిటీపై అభిమానుల విమ‌ర్శ‌లు

అభిమాన గ‌ణం ఉన్న హీరోలు, హీరోయిన్లు తామే సొంతంగా ఒక బ్రాండ్‌ను తీసుకొచ్చి వ్యాపారంలో కూడా ప్ర‌వేశించ‌డం మ‌న‌కు తెలిసిందే

  • Publish Date - December 18, 2023 / 09:44 AM IST

విధాత: అభిమాన గ‌ణం ఉన్న హీరోలు, హీరోయిన్లు తామే సొంతంగా ఒక బ్రాండ్‌ను తీసుకొచ్చి వ్యాపారంలో కూడా ప్ర‌వేశించ‌డం మ‌న‌కు తెలిసిందే. మ‌న దేశంలో హీరోల‌కు, హీరోయిన్‌ల‌కు ఎంత క్రేజ్ ఉంటుందో.. అమెరికా (America) లో సంగీత క‌ళాకారుల‌కు అంత క్రేజ్ ఉంటుంది. వీరు స్టేజ్ ఎక్కి పాడితే కింద ల‌క్ష‌ల్లో అభిమానులు ఊగిపోతారు. అటువంటి అభిమానుల‌ను సంపాదించుకున్న ర్యాప‌ర్ కేన్ వెస్ట్ (Kanye West) అలియాస్ యే. అయితే ఇత‌డు ఒక విచిత్రమైన అంశానికి సంబంధించి వార్త‌లో నిలిచాడు.


కేన్ ఇటీవ‌ల ప్రారంభించిన వైజెడ్‌వై పీఓడీ (YZY POD) అనే షూ బ్రాండ్ ఒక కొత్త మోడ‌ల్‌ను విడుద‌ల చేసింది. చూడ‌టానికి అచ్చం సాక్సుల్లా ఉన్న ఆ షూల ధ‌ర‌ను ఏకంగా రూ.16,595 (200 డాలర్లు) అని ప్ర‌క‌టించింది. దీంతో కేన్‌ అభిమానులంద‌రూ సోష‌ల్ మీడియా వేదిక‌గా అత‌డిపై విరుచుకుప‌డుతున్నారు. షూల‌ని చెప్పి సాక్సుల్లాంటివి త‌యారుచేయ‌డం.. ఆ ధ‌ర కూడా ఆకాశంలో ఉండ‌టంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వీటిని మార్కెట్‌లోకి విడుద‌ల చేస్తూ.. మ‌డ‌త‌ పెట్టుకునే ఫుట్‌వేర్ మోడ‌ల్‌లో ఇది అత్యుత్త‌మ‌మైన‌ది అని కీన్ ప్ర‌క‌టించాడు.


అంతే కాకుండా త‌న మోడ‌ల్‌కు న‌కిలీలు కూడా వ‌స్తాయ‌ని వాటిని అభిమానులు తిర‌స్క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశాడు. 200 డాల‌ర్లు అంటే చాలా ఎక్కువ అని ఒక‌రు వ్యాఖ్యానించ‌గా.. మ‌రికొంద‌రు ఆ ధ‌ర ఒక సాక్స్‌కా లేక రెండింటికీనా అని వ్యంగ్యంగా ప్ర‌శ్నిస్తున్నారు. రెండు సాక్సుల‌కు 200 డాల‌ర్లు ఎవ‌రు ఇవ్వ‌గ‌ల‌రు అని మ‌రో యూజ‌ర్ రాసుకొచ్చాడు. ధ‌ర‌, మోడ‌ల్‌పైనే కాకుండా దాని సైజుల పైనా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న సైజుల్లో కాకుండా 1, 2, 3 సైజుల్లో ఈ షూ ల‌భిస్తుంద‌ని పేర్కొన‌డం విశేషం. తాము వాటిల్లో ఏ సైజో తెలుసుకోవ‌డం ఎలాగా అని ఎక్స్‌లో ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురుస్తోంది. అయితే ఈ విమ‌ర్శ‌ల‌పై కేన్ ఇప్ప‌టి వ‌ర‌కు పెద‌వి విప్ప‌లేదు.


అత‌డి లాయ‌ర్ కెన్నెత్ ఆనంద్ స్పందించారు. ఒక కొత్త బ్రాండ్‌ను సృష్టించి దానికి వాల్యూను తీసుకురావ‌డం చాలా ఖ‌ర్చుతో కూడుకున్న‌ద‌ని ఆయ‌న అన్నారు. ఆ షూ త‌యారీకి అత్యుత్త‌మ మెటీరియ‌ల్‌ను వాడారాని అందుకే అంత ధ‌ర‌ను పెట్టార‌ని పేర్కొన్నారు. వెటెమెంట్స్‌, బాలెన్సియాగా వంటి ల‌గ్జ‌రీ బ్రాండ్ ఉత్ప‌త్తుల‌తో పోలిస్తే కేన్ ప్ర‌క‌టించిన ధ‌ర స‌మంజ‌స‌మేన‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. యూదుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు గానూ ప్ర‌ముఖ ఫుట్‌వేర్ సంస్థ కేన్‌ను త‌మ బ్రాండ్ అంబాసిడర్‌గా తొల‌గించింది. 2022లో ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌గా అనంత‌రం తానే ఒక ఫుట్‌వేర్ బ్రాండ్‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకుని వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.