Karimnagar
విధాత బ్యూరో, కరీంనగర్: వ్యక్తిగత అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున గుండెపోటులకు దారితీస్తున్నాయి. అనేక సందర్భాల్లో ఇవి ఆయా వ్యక్తుల కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి.
తాజాగా జన్మదిన వేడుకకు హాజరైన వ్యక్తి అక్కడే ఏర్పాటు చేసిన భోజనం తిని తదనంతరం గుండెపోటుకు గురై కుప్పకూలారు. సకాలంలో వైద్యులు సిపిఆర్ చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ వైద్యశాలకు తరలించగా మరో 40 నిమిషాలకు ఆ వ్యక్తి మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా మానకొండుర్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు శనివారం జరిగాయి. ఎక్కడ ఇలాంటి వేడుక జరిగినా, ఆహ్వానం లేకున్నా వచ్చి భోజనం చేసి వెళ్లే అలవాటు ఉన్న అలుగునూరు గ్రామానికి చెందిన
అవునురి మల్లేశం భోజనం చేసి కేక్ తింటున్న క్రమంలో గుండెపోటుతో కుప్పకూలాడు.
కవ్వంపల్లి సత్యనారాయణ స్వతహాగా వైద్యుడు కావడం, వేడుకల్లో అనేకమంది వైద్యులు కూడా పాల్గొనడంతో, వారు మల్లేశం పరిస్థితిని గమనించి సిపిఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేశారు. అనంతరం ఆయనను చికిత్స నిమ్మతం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మల్లేశం మృతి చెందారు.