Karnataka | విధాత: హుక్కా పీల్చడంపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రవ్యాప్తంగా హుక్కా విక్రయాలు, వాడకాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రజారోగ్యాన్ని కాపాడాలని, యువతను హుక్కా వ్యసనం నుంచి దూరం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర వైద్యరోగ్యశాఖ మంత్రి దినేశ్‌గుండురావు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఈ విషయాన్ని గురువారం వెల్లడించారు.
హుక్కా పీల్చడం వల్ల అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నందున హుక్కాపై నిషేధం విధించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టాన్ని (COTPA) సవరించడం ద్వారా కర్ణాటకలో హుక్కా పీల్చడంపై నిషేధాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. మన భవిష్యత్ తరాలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించడానికి తమ ప్రభుత్వం సదా కృషి చేస్తుందని తెలిపారు.