విధాత : తుంటి ఎముక ఆపరేషన్ అనంతరం కోలుకుంటున్న బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం అసెంబ్లీకి వచ్చారు. కొత్త కారులో వచ్చిన కేసీఆర్ కారు దిగి చేతి కర్ర సహాయంతో అసెంబ్లీ హాల్‌లోని స్పీకర్ చాంబర్‌కు చేరుకున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ తన చాంబర్‌లో కేసీఆర్‌తో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. నిర్దేశించుకున్న మూహుర్తానికి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం టీఆరెస్‌ఎల్పీ నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆరెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు సహా మాజీ కార్పోరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ ఓటమి అనంతరం అధికారం కోల్పోయిన షాక్‌లో ఉన్న కేసీఆర్ అనుకోకుండా తన ఫామ్‌హౌస్‌లో జారీ పడ్డాడు. దీంతో ఆయనకు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరుగగా, క్రమంగా కోలుకుంటున్నారు. కోలుకున్నాక అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఈ మేరకు గురువారం అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. అధికారం కోల్పోయాక తొలిసారిగా అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌ను చూసేందుకు అక్కడున్న వారంతా ఆసక్తి చూపారు. చేతి కర్ర సహాయంతో నడుస్తున్న కేసీఆర్‌ను చూసిన బీఆరెస్ శ్రేణులు తమ నాయకుడు మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటాడని, రానున్న లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపిస్తారని భారీ ఆశలే పెట్టుకున్నారు.