Site icon vidhaatha

Tirumala Leopard: తిరుమలలో మళ్లీ చిరుత కలకలం !

Tirumala Leopard:  తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్ల మార్గంలో 500 మెట్టు దగ్గర చెట్లపొదల్లో చిరుత కనిపించింది. చిరుతను చూసిన భక్తులు సెక్యూరిటీకి సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సైరన్‌ మోతతో చిరుతను అటవీ ప్రాంతంలోకి తరిమారు. ముందు జాగ్రత్తగా మెట్ల మార్గంలో భక్తులను బృందాలుగా అనుమతిస్తున్నారు. చిరుత సంచారంతో భద్రతా చర్యలకు కట్టుదిట్టం చేశారు. 12ఏళ్ల లోపు చిన్నారులను మెట్ల మార్గంలో అనుమతించడం లేదు. గతంలో చిరుత చిన్నారులపై దాడి చేసిన ఘటనలు..ప్రాణనష్టం చోటుచేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో టీటీడీ, అటవీ శాఖ అప్రమత్తమైంది.

ఇటీవల మే నెల 25న కూడా అలిపిరి మెట్ల మార్గంలో 350మెట్టు ప్రాంతంలో ఘాట్ రోడ్డు పిట్ట గోడపై చిరుత వెలుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు, గాలి గోపురం ప్రాంతాల్లో తరుచు చిరుతలు, ఎలుగుబంట్లు, వన్యప్రాణులు సంచరిస్తుండటంతో శేషాచలం అడవుల్లో వాటి సంఖ్య పెరిగినట్లుగా భావిస్తున్నారు. వన్యప్రాణులు, చిరుతల సంచారాన్ని గమనించేందుకు టీటీడీ, అటవీ శాఖలు 500వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాయి. గతంలో తిరుమల ప్రాంతంలో వివిధ ప్రదేశాల్లో ఏడు చిరుతలను గుర్తించారు. వాటిలో ముడింటిని బంధించి ఇతర ప్రాంతాల్లో విడిచిపెట్టారు.

Exit mobile version