Minister Errabelli
- పంట నష్టాన్ని పరిశీలించాలి
- ధాన్యం మక్కల కొనుగోలు వేగవంతం చేయాలి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఏమాత్రం జాప్యం చేయకుండా జిల్లా అధికారులు అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి ప్రభుత్వానికి సకాలంలో నివేదికలు పంపించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేసేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
అకాల వర్షాలు, పంటల నష్టాలు, ధాన్యం కొనుగోళ్లపై వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులతో సోమవారం హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్ష రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షించారు.
మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్ ఇలాఉన్నాయి.
అన్ని మండలాల్లో జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి, పంట నష్టాన్ని పరిశీలించి, రైతులకు ధైర్యాన్ని కల్పించాలన్నారు. దెబ్బ తిన్న పంటల నష్టాలను వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని సూచించారు. కౌలు రైతులతోపాటు, నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూడాలని చెప్పారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతుల పంటలను ప్రభుత్వం పరంగా ఆఖరు గింజ వరకు కొనుగోలు చేసే విధంగా చూడాలని చెప్పారు.
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. రైస్ మిల్లర్లతో సమావేశాలు నిర్వహించి, కాంటాల్లో కోతలు లేకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. సేకరించిన ధాన్యం రవాణాను సైతం వేగంగా చేపట్టాలని చెప్పారు.
సీఎం కెసిఆర్ నిర్ణయాన్ని రైతులకు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. ధాన్యంతో పాటు మక్కల కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని కోరారు.
ఈ సమీక్ష సమావేశంలో వర్ధన్నపేట, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు అరూరి రమేష్, సతీష్ బాబు. వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, వ్యవసాయాధికారులు ఉషాదయాళ్, డి.ఆర్.డి.వో పిడిలు శ్రీనివాస్ కుమార్, సంపత్ రావు, అధికారులు పాల్గొన్నారు.