Jagityala: మంత్రి కొప్పుల అవినీతి ఆరోపణలు.. అవాస్తవమ‌ని కోటిలింగాలలో ప్రతిజ్ఞ చేసిన లక్ష్మణ్ కుమార్

పోలీసుల బలంతో కాదు, దమ్ముంటే తన వద్దకు రావాలని మంత్రికి సవాల్ లక్ష్మణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సారంగాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలింపు విధాత బ్యూరో, కరీంనగర్: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, గత ఎన్నికల్లో ఆయన చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చూసిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు. […]

  • Publish Date - April 3, 2023 / 04:30 PM IST

  • పోలీసుల బలంతో కాదు, దమ్ముంటే తన వద్దకు రావాలని మంత్రికి సవాల్
  • లక్ష్మణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • సారంగాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలింపు

విధాత బ్యూరో, కరీంనగర్: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, గత ఎన్నికల్లో ఆయన చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చూసిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు.
నియోజకవర్గంలో ఓవైపు ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, మరోవైపు అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఆసక్తి రేపుతున్నాయి.

ధర్మపురిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై చేసిన ఆరోపణలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

‘ఒక్కసారి అధికారంలోకి వస్తే.. ఎన్ని తీర్ల మారినవో.. జడ్పిటిసి, ఎంపీటీసీ టికెట్లు అమ్ముకున్నవ్.. డబ్బు ఇచ్చిన వారికే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు కట్టబెట్టినవ్’ ఆ చరిత్ర మాకు లేదు… అంటూ కాంగ్రెస్ నేత లక్ష్మణ్ కుమార్ పై అవినీతి ఆరోపణలు సంధించారు మంత్రి ఈశ్వర్.

దీనిపై లక్ష్మణ్ కుమార్ తీవ్రంగానే ప్రతిస్పందించారు. ‘మా ఇంటి దైవం శివుడు… రాజకీయంగా ఎవరి వద్ద నయా పైసా తీసుకోలేదన్న విషయాన్ని… ప్రముఖ శివాలయం కోటిలింగాలలో గర్భగుడిలో దేవుడిపై ప్రమాణం చేసి చెప్తాస‌ అని మంత్రి ఆరోపణలకు దీటుగా బదులిచ్చారు. అంతటితో ఆగిపోకుండా ఆయన సోమవారం కోటిలింగాల ఆలయానికి వెళ్లి గర్భగుడిలో దేవుడిపై ప్రమాణం చేసి తన సచ్చిలత నిరూపించుకునే ప్రయత్నం చేశారు.

కార్యక్రమం అనంతరం ఇథనాల్ బాధితులు జగిత్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఆయనను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకొని సారంగాపూర్ పోలీస్ స్టేషన్ తరలించారు.

పోలీసులు తనను అదుపులోకి తీసుకోవడం పట్ల లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. పోలీసులను పంపడం కాదు దమ్ముంటే మంత్రి ఈశ్వర్ తన వద్దకు రావాలని సవాల్ విసిరారు. శాసనసభ ఎన్నికల నాటికి నియోజకవర్గ రాజకీయాలు వాడి, వేడిగా మారి మరెన్ని మలుపులు తిరుగుతాయోనని
ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Latest News