లక్నో : పొలం వద్దకు నడుచుకుంటూ వెళ్తున్న ఓ తొమ్మిదేండ్ల చిన్నారిపై చిరుత దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బధియోవాలా గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బధియోవాలా గ్రామానికి చెందిన నైనా(9) అనే అమ్మాయి.. తన తండ్రి పని చేస్తున్న పొలం వద్దకు సోమవారం మధ్యాహ్నం బయల్దేరింది. అక్కడున్న నది వెంట ఆమె నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో చిరుత ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచింది.
పులి దాడిని తట్టుకోలేక బాలిక గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికంగా ఉన్న రైతులందరూ కలిసి పులిని వెంబడించారు. దాంతో పాపను వదిలేసి పులి పారిపోయింది. తీవ్ర గాయాలపాలైన బాలికను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.
నైనా తండ్రి మహేంద్ర జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి అని స్థానికులు తెలిపారు. బతుకుదెరువు కోసం కొన్నేండ్ల క్రితం మహేంద్ర తన కుటుంబంతో యూపీకి వలసొచ్చాడని పేర్కొన్నారు. బధియోవాలాలోని చెరుకు తోటల్లో కూలీగా పని చేస్తున్నట్లు తెలిపారు