న్యూఢిల్లీ : అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెలుతు టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కూలిపోయిన ఏయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పరిశీలించారు. ఈ ప్రమాదంలో 265మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ విమాన ప్రమాదం జరిగిన తీరుకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విమానం కూలి పడటంతో దెబ్బతిన్న బీజీ మెడికల్ కళాశాలను పరిశీలించారు. అటు నుంచి ప్రధాని మోదీ నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లారు. విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ ను ప్రధాని మోదీ పరామర్శించారు. ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డావని మోదీ ఆసక్తి కరంగా ప్రశ్నించగా..తాను ఎమర్జన్సీ డోర్ వద్ద కూర్చుకోవడంతో ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డానని విశ్వాస్ కుమార్ తెలిపారు. అనంతరం విమానం మెడికల్ కళాశాల భవనంపై కూలడంతో గాయపడిన మెడికల్ విద్యార్ధులను మోదీ పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు.
అనంతరం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో విమాన ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. విమాన ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇంతపెద్ద విమాన ప్రమాదం ఊహించని విషాదంగా అభివర్ణించారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాల గురించే తన ఆలోచన అంతా అని..వారు తమ ఆప్తులను కోల్పోయిన బాధ ధీర్ఘకాలం ఉంటుందన్నారు. ప్రధాని మోదీ వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి తదితరులు ఉన్నారు.
ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జాగిలాల సాయంతో మృతదేహాల కోసం శిథిలాల కింద గాలిస్తున్నారు. ఎయిరిండియా ఎండీ, సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ కూడా ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఒక్క ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడ్డారు. విమానం బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయంపై కూలడంతో అందులోని 24 మంది మృత్యువాత పడ్డారు. విమాన ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తుకు కీలకమైన బ్లాక్ బాక్స్ శిధిలాలలో లభ్య మవ్వడంతో ప్రమాద కారణాలపై స్పష్టత రానుంది. అటు మృతులను గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టుల కోసం వైద్యులు శాంపిల్స్ సేకరిస్తున్నారు. తమ వారి మృతదేహాల కోసం వచ్చిన వారి రోధనలతో ఆసుపత్రి పరిసరాలు విషాదమయమయ్యాయి.