Site icon vidhaatha

ప్రభాస్ చిన్న పిల్లాడు.. ఎన్టీఆర్ అల్లరోడు: నయనతార

విధాత: నయనతార పేరు వింటేనే దక్షిణాదిలో చాలామంది ప్రేక్షకులు, అభిమానులు పులకరించిపోతారు. త‌మిళ‌నాట కుష్బూ తర్వాత ఆరాధ్య దైవంగా మారిన హీరోయిన్ నయనతార అని చెప్పాలి. ఈమెకు కోలీవుడ్‌లో స్టార్ హీరోలకు సరి సమానమైన ఇమేజ్ ఉంది. ఈమె బొమ్మ పోస్టర్‌పై కనిపిస్తే ఆ థియేటర్లు కిక్కిరిసిపోతాయి. మలయాళంకు చెందిన ఈ ముద్దుగుమ్మ రజినీకాంత్ నటించిన చంద్రముఖి ద్వారా తెలుగు ప్రేక్షకులలో బాగా పేరు సంపాదించుకుంది. ఆ తరువాత విక్టరీ వెంకటేష్ స‌ర‌స‌న ‘లక్ష్మీ, తులసి, బాబు బంగారం’ చిత్రాల్లో నటించింది.

ఇంకా నాగార్జున సరసన ‘బాస్’ మూవీతో జతకట్టింది. బాలయ్య సరసన ‘శ్రీరామరాజ్యం’లో సీతగా చేసింది. ఆమెకున్న ఒకే ఒక లోటు మెగాస్టార్ చిరంజీవితో నటించకపోవడం దానిని ఆమె తాజాగా సైరా న‌ర‌సింహారెడ్డి, గాడ్ ఫాదర్ తో నెరవేర్చుకుంది. ఇలా ఈమె చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తరంలోనే కాదు.. ఈ తరంలోని జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ వంటి వారితో కూడా కలిసి నటించింది. ఈమధ్య ఆమె చిన్న చిన్న పాత్రలు, హీరోయిన్ వేషాలను తగ్గించి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తోంది. కర్తవ్యం, అమ్మోరు తల్లి వంటి చిత్రాలు చేసింది.

నయనతారకు ఎంత క్రేజ్ అంటే ఆమె సినిమా ఒప్పుకునే ముందు తాను ప్రమోషన్స్‌కు రానని అగ్రిమెంట్ చేయించుకుంటుంది. ఏ సినిమా ప్రమోషన్స్‌లోనూ కనిపించదు. తన పాత్రకు ప్రాధాన్యత రాకపోతే ఒప్పుకోదు. ఇలా ఉంటుంది నయనతార వ్యవహారం. కానీ ఆమె లేడీ ఓరియంటెడ్ చిత్రాలు మొదలు పెట్టిన తర్వాత అందులో ఎక్కువగా తన భర్త దర్శకుడు విగ్నేశ్ శివన్‌తో చిత్రాలు చేస్తూ, సొంత‌గా నిర్మిస్తూ వస్తుంది. దాంతో ఆమె ఈ మధ్య కాస్త మరలా ప్రమోషన్స్‌కు రావడం మొదలుపెట్టింది.

తాజాగా ఆమె నటించిన ‘కనెక్ట్’ చిత్రం విడుద‌ల సంద‌ర్భంగా యాంకర్ సుమ కనకాలకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది ఈ లేడీ సూపర్ స్టార్! మొదటగా ఆమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ఆయన చాలా స్వీట్ పర్సన్. ఆయ‌న‌ది చిన్నపిల్లల మనస్తత్వం. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు కానీ నాతో కలిసి నటించేప్పుడు మాత్రం చాలా సరదాగా ఉండేవాడు. చుట్టూ ఎగురుతూ జోకులు వేస్తూ ఉండేవాడు. ప్రభాస్‌తో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉండేది. ఇప్పుడు అతను పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది.

ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతూ.. తారక్ పెద్ద అల్లరోడు. ఒకరోజు మేకప్ టచ్ చేసుకుంటూ ఉన్నాను. అతను వచ్చి ఎందుకు అని అడిగాడు. షాట్‌‌కి సిద్ధమవుతున్నా అని చెప్పాను. అక్కడ నిన్ను ఎవరూ చూడరు. అందరూ నన్నే చూస్తారని ఆటపట్టించాడు. ఎన్టీఆర్ డాన్స్ కోసం, తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం కోసం ఆయన చూపే డెడికేషన్, అందుకోసం త‌న‌ను తాను మార్చుకునే విధానం చూసి నేను ఆశ్చర్యపోయే దానిని.

అతను ప్రాక్టీస్ చేయడం అనేది ఎప్పుడూ చూడలేదు. నాకు తెలిసి రిహార్స‌ల్స్ చేయ‌ని ఏకైక హీరో తార‌క్‌ అని కితాబునిచ్చింది. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. బాలయ్య బాబు.. ప్రభాస్, ఎన్టీఆర్ల కంటే పెద్ద అల్లరివాడు. చాలామంది బాలకృష్ణని చూసి భయపడతారు. కానీ ఆయన చాలా జోవియల్ మనిషి. నేను చూసిన అత్యంత సంతోషకరమైన వ్యక్తుల్లో బాలకృష్ణ ఒకరు. ఆయనతో కలిసి పనిచేయడం ఎప్పుడూ సరదాగా ఉండేది అని న‌య‌న‌తార చెప్పుకొచ్చింది.

కాగా, లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రభాస్‌తో యోగి చిత్రంలోనూ.. ఎన్టీఆర్‌తో అదుర్స్ చిత్రం చేసింది. ఇక బాలకృష్ణతో శ్రీరామరాజ్యం, సింహ, జై సింహ ఇలా మూడు సినిమాలు చేసింది.

Exit mobile version