Site icon vidhaatha

Nalgonda: వారసుడితో క‌లిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న‌ గుత్తా

విధాత: రంజాన్ పర్వదినాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకుని మత సామ రస్యానికి ప్రతీకగా నిలవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం నల్గొండ పట్టణంలోని పోలీస్ ఆడిటోరియంలో గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అధ్యక్షతన ముస్లింలకు దావత్- ఏ -ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో సుఖేందర్ రెడ్డి, తన రాజకీయ వారసుడైన గుత్తా అమిత్ రెడ్డితో కలిసి పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

తెలంగాణ ప్రజలందరూ శాంతి భద్రతలను కాపాడుతూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలన్నారు. ముస్లిం మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమేనన్నారు.. అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఆనందంగా ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హిందు, ముస్లిం ప్రజలు సొంత అన్నదమ్ములుగా కలిసి ఉంటారని చెప్పారు. శాంతి భద్రతలు కాపాడటంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరి, సోదరులు అత్యంత భక్తి శ్రద్దలు క్రమశిక్షణతో ఉపవాస దీక్షలు చేస్తారన్నారు. నల్గొండ పట్టణంలో వారి కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అనందంగా ఉందన్నారు. ఆహ్వానాన్ని మన్నించి ఇఫ్తార్ దావత్ కి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో నల్గొండ జడ్పి ఫ్లోర్ లీడర్, పాశం రాం రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పుల్లెంల వెంకట్ నారాయణ గౌడ్, బషీరుద్దీన్, హన్ను, అనీష్ , నిరంజన్ వలీ, ఖలిల్, హసిమ్, శ్రవణ్ కుమార్, ఐతగోని స్వామి గౌడ్, దుబ్బా అశోక్ సుందర్, కనగల్ ఎంపీపీ కరీం పాషా, జెడ్పిటిసి చిట్ల వెంకటేశం, ఎండి కాసిం, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version