Site icon vidhaatha

Revanth Reddy। హర్యానా రైతుల స్ఫూర్తితో పోరాడండి

విధాత: తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని చంపేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు (CM KCR) కుట్రలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)ఆరోపించారు. ఆత్మగౌరవంతో బతికే రైతులను కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వైపు పురికొల్పారని మండిపడ్డారు.

కేసీఆర్‌ చెబుతున్న ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటే ఇదేనా? అని ఆయన ఎద్దేవా చేశారు. కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని ముత్యంపేటలో ఉన్న నిజాం చక్కెర కర్మాగారాన్ని (Nizam Sugar Factory) రేవంత్ రెడ్డి శనివారం సందర్శించారు.

చక్కెర కర్మాగారం నడపలేనోళ్లు.. రాష్ట్రాన్ని నడిపిస్తారా?

రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పది లక్షల మంది చెరుకు రైతుల (Sugarcane Farmers) ఓట్లతో గెలిచిన బీజేపీ (BJP) , బీఆర్ఎస్ (BRS) నాయకులు చెరుకు రైతుల సంక్షేమం కోసం కనీసం ఒక శాతం నిధులు కూడా కేటాయించలేకపోయారని విమర్శించారు. మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో చక్కర కర్మాగారాలు నడప లేకపోవడం శోచనీయమని అన్నారు. కనీసం ఓ చక్కర కర్మాగారాన్ని నడిపించలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారని రేవంత్ ప్రశ్నించారు.

వంద రోజుల్లో ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తామని కవిత (MLC Kavitha) హామీ ఇస్తే, చక్కెర కర్మాగారం ముగిసిన అధ్యాయం అని ఆమె తండ్రి శాసనసభ సాక్షిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో రైతులది ముగిసిన అధ్యాయం అయితే, కేసీఆర్ అధికారం కూడా ముగిసిన అధ్యాయమే అవుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు నెలల లోపు ముత్యంపేట చక్కర కర్మాగారాన్నితెరిపిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ఇదేనా కిసాన్‌ సర్కార్‌?

‘ఒకనాడు వరివేస్తే ఉరి అని ప్రకటించారు. రాష్ట్రాన్ని సీడ్‌ బౌల్ (Seed Bowl) చేస్తామని చెప్పి.. పరిశ్రమలను మూసేస్తున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. కిసాన్ సర్కార్‌ అంటే అర్థం ఇదేనా?’ అని రేవంత్ ముఖ్యమంత్రిని నిలదీశారు.

వ్యవసాయ రంగానికి (Agri Bills) సంబంధించి కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలపై పోరాడి.. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆ చట్టాలను వెనక్కు తీసుకునేలా చేసిన ఘనత హర్యానా రైతులదని, ఆ రైతుల స్ఫూర్తితో తెలంగాణ రైతాంగం ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రైతు పోరాటాలకు తమ పార్టీ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కన్నా రైతుల ప్రయోజనాలకే కాంగ్రెస్ అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌ మోడల్‌ కావాలి

తెలంగాణకు ఛత్తీస్‌గఢ్‌ మోడల్ (Chhattisgarh model) అవసరమని రేవంత్‌రెడ్డి అన్నారు. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు ఎకరాకు తొమ్మిది వేల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయ రంగంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని రేవంత్ ప్రకటించారు. ఐటీ మంత్రి వచ్చినా, వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినా గత కాంగ్రెస్, ప్రస్తుత బీఆర్ఎస్ పాలనలో రైతాంగానికి జరిగిన న్యాయ, అన్యాయాలపై చర్చకు సిద్ధమన్నారు. కాంగ్రెస్ పార్టీది రైతులను ఆదుకునే విధానం అయితే బీఆర్ఎస్ పార్టీది రైతులను ఆత్మహత్యలకు పూరికొల్పే విధానమని మండిపడ్డారు.

Exit mobile version