సాం ఆల్ట్‌మ‌న్ తొల‌గింపుపై ఓపెన్ ఏఐ ఉద్యోగుల తిరుగుబాటు.. సీఈఓగా పునఃనియామ‌కం!

చాట్ జీపీటీని రూపొందించిన ఓపెన్ ఏఐ (Open AI) మాజీ సీఈఓ సాం ఆల్ట్‌మ‌న్ (Sam Altman) తొల‌గింపు విష‌యంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి

  • Publish Date - November 22, 2023 / 09:39 AM IST

విధాత‌: చాట్ జీపీటీని రూపొందించిన ఓపెన్ ఏఐ (Open AI) మాజీ సీఈఓ సాం ఆల్ట్‌మ‌న్ (Sam Altman) తొల‌గింపు విష‌యంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తొలుత‌ అత‌డు బోర్డు డైరెక్ట‌ర్ల న‌మ్మ‌కాన్ని కోల్పోయారని పేర్కొంటూ సీఈఓ ప‌ద‌వి నుంచి తొల‌గించారు. ఒక రోజు వ్య‌వ‌ధిలోనే ఓపెన్ ఏఐకు నిధులు స‌మ‌కూరుస్తున్న మైక్రోసాఫ్ట్ ఈ విష‌యంపై స్పందిస్తూ.. సాంను త‌మ సంస్థ‌లోకి ఆహ్వానిస్తున్నామ‌ని ప్ర‌క‌టించింది.


తాజాగా సాంను తిరిగి ఓపెన్ ఏఐలో నియ‌మించుకుంటామ‌ని ఓపెన్ ఏఐ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. సాంతో ఒక ఒప్పందానికి వ‌చ్చామ‌ని.. అత‌ణ్ని తిరిగి సీఈఓగా తీసుకుని.. బోర్డు స‌భ్యుల‌ను మారుస్తామ‌ని మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది. సాం ఉద్వాస‌న‌కు వ్య‌తిరేకంగా సంస్థ ఉద్యోగులందూ తిరుగుబాటు చేయ‌డ‌మే దీనికి కార‌ణమ‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.


ఓపెన్ ఏఐ సీఈఓగా సాం ఆల్ట‌మన్‌ను తిరిగి తీసుకోవ‌డానికి నిర్ణ‌యించాం. బోర్డు కొత్త ఛైర్మ‌న్‌గా బ్రెట్ టేల‌ర్‌, స‌భ్యులుగా లారీ స‌మ‌ర్స్‌, ఆడం డి యాంజెలో ఉంటారు అని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ వ్య‌వ‌హారంపై సాం ఆల్ట్‌మ‌న్ స్పందించారు. ఓపెన్ ఏఐలోకి తిరిగి వెళ్ల‌డానికి ఎదురుచూస్తున్న‌ట్లు పేర్కొన్నారు. నేను ఓపెన్ ఏఐను ప్రేమిస్తాను. ల‌క్ష్యాన్ని మాత్ర‌మే చూస్తూ ఒక అద్భుత‌మైన బృందంతో అక్క‌డ ప‌నిచేశా.


మ‌రోసారి ప‌నిచేయ‌డానికి ఎదురు చూస్తున్నా. మైక్రోసాఫ్ట్‌తో దృఢ‌మైన బంధాన్ని ఏర్ప‌ర‌చుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తా అని సాం ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై మైక్రోసాఫ్ట్ సీఈఓ స‌త్య నాదెళ్ల కూడా స్పందించారు. న‌మ్మ‌క‌మైన , స్థిర‌మైన ప‌రిస్థితుల ఏర్పాటుకు ఇది తొలి మెట్టు అని వ్యాఖ్యానించారు. కృత్రిమ మేధ‌ను క‌మ‌ర్షియ‌లైజ్ చేయ‌డం, ప‌రిధి దాటి విస్త‌రించ‌డం త‌దిత‌ర అంశాల‌పై ఓపెన్ ఏఐ బోర్డుకు సాం ఆల్ట్‌మ‌న్‌కు విభేదాలు త‌లెత్తాయి. ఈ అంశాల‌పైనే ఇప్పుడు ఇరు వ‌ర్గాల మ‌ధ్యా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

Latest News