Site icon vidhaatha

Srisailam Temple | మార్చి ఒకటి నుంచి శ్రీశైల మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

Srisailam Temple | ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలం దేవస్థానం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. మార్చి ఒకటి నుంచి 11 వరకు 11 రోజుల పాటు నేత్రపర్వంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇప్పటికే దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులో సమావేశమై ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించి.. వేడుకలకు హాజరయ్యే భక్తులకు అన్ని ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు.


వేలాది మంది భక్తులు పాదయాత్రగా శ్రీశైల క్షేత్రానికి చేరుకోనుండగా.. పాదయాత్ర మార్గంలోని భీమునికొలను, కైలాసద్వారం మార్గంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అటవీశాఖతో కలిసి యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించాలని సిబ్బందికి సూచించారు. వైదిక కార్యక్రమాలు, వాహనసేవలు, మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ, ఆలయ వేళలు, దర్శనం ఏర్పాట్లపై చర్చించారు. వేడుకలపై మరోసారి కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమీక్షించనున్నారు.


బ్రహ్మోత్సవాల్లో కార్యక్రమాలు ఇలా..



మార్చి ఒకటిన ధ్వజారోహణ, శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం వారిచే పట్టువస్త్రాలు సమర్పణ ఉంటుంది.

2న భ్రమరాంబసమేత మల్లికార్జునస్వామి భృంగి వాహనంపై విహరిస్తారు.

3న హంసవాహన సేవ ఉంటుంది. విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తుంది.

4న మయూరవాహనసేవ శ్రీస్వామి, అమ్మవారు విహరిస్తారు. అదే రోజు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం, టీటీడీ ఆలయాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తాయి.

5న రావణ వాహన సేవ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పిస్తుంది.

6న పుష్ప పల్లకీ సేవ ఉంటుంది.

7న గజవాహనసేవపై స్వామి, అమ్మవార్లపై విహరిస్తారు.

8న మహాశివరాత్రి ప్రభోత్సవం, నంది వాహనసేవ ఉంటుంది. స్వామివారికి లింగోద్భవకాలంలో మహారుద్రాభిషేకం, కల్యాణోత్సవం జరుగుతుంది.

9న రథోత్సవం, తెప్పోత్సవం జరుగుతాయి.

10న ధ్వజావరోహణ కార్యక్రమం ఉంటుంది.

11న అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Exit mobile version