Telangana Assembly | ఈ నెల 13 వ‌ర‌కు అసెంబ్లీ స‌మావేశాలు

బ‌డ్జెట్ అసెంబ్లీ స‌మావేశాలు ఈనెల 13వ తేదీ వ‌ర‌కు జ‌ర‌పాల‌ని బీఏసీ నిర్ణ‌యించింది. గురువారం అసెంబ్లీ వాయిదా ప‌డిన త‌రువాత బీఏసీ స‌మావేశం జరిగింది

  • Publish Date - February 8, 2024 / 12:45 PM IST

  • 10న బ‌డ్జెట్‌-11న సెల‌వు

విధాత‌: బ‌డ్జెట్ అసెంబ్లీ స‌మావేశాలు ఈనెల 13వ తేదీ వ‌ర‌కు జ‌ర‌పాల‌ని బీఏసీ నిర్ణ‌యించింది. గురువారం అసెంబ్లీ ఉభ‌య స‌భ సంయుక్త స‌మావేశం వాయిదా ప‌డిన త‌రువాత స్పీకర్ చాంబ‌ర్‌లో బీఏసీ స‌మావేశం జరిగింది. ఈ స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు, పొన్నం ప్ర‌భాక‌ర్‌, ఎమ్మెల్యే బీర్లైల‌య్య‌ , బీఆరెస్ నుంచి ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి, సీపీఐ నుంచి కూనంనేని సాంభ‌శివ‌రావు, ఎంఐఎం నుంచి అక్బ‌రుద్ధీన్ ఓవైసీలు, అసెంబ్లీ కార్య‌ద‌ర్శి న‌ర్సింహాచారి పాల్గొన్నారు.


బీఏసీ స‌మావేశ వివ‌రాల‌ను క‌డియం శ్రీ‌హ‌రి మీడియాకు వివ‌రించారు. శుక్ర‌వారం గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ ఆమోదం ఉంటుంద‌న్నారు. ఈనెల‌10వ తేదీన బ‌డ్జెట్ ఉంటుంద‌ని, 11వ తేదీ ఆదివారం సెల‌వు ఉంటుంద‌ని, 12,13 తేదీల‌లో బ‌డ్జెట్ ప‌ద్దుల‌పై చ‌ర్చ ఆమోదం ఉంటుంద‌న్నారు. స‌భ‌ను అతి కొద్ది రోజులు మాత్ర‌మే నిర్వ‌హించ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం కావ‌డంతో స‌భ్యులు కోరితే స‌భ‌ను పొడిగిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన‌ట్లు స‌మాచారం.


క్వ‌శ్చ‌న్ అవ‌ర్‌, జీరో అవ‌ర్‌పై స్ప‌ష్ట‌త ఏదీ


ముఖ్యమంత్రి స్టేట్ మెంట్ వల్ల, కాంగ్రెస్ పార్టీ నుండి ఓడిపోయిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని క‌డియం ఆరోపించారు. రాష్ట్రంలో ప్రోటో కాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. ఇటువంటివి జరగడం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తోందన్నారు. నాలుగు రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు ముగిస్తున్నారని తెలిపారు. మేము మాత్రం ప్రజల తరుపున ఉండి కొట్లాట చేస్తామ‌న్నారు. ప్ర‌భుత్వం క్వశ్చన్ ఓవర్ మీదా గాని , జీరో అవర్ మీదా గాని స్పష్టత ఇవ్వలేదన్నారు.

Latest News