Site icon vidhaatha

Ramoji Rao | రామోజీకి అండగా టీడీపీ.. ట్విట్టర్‌లో ట్రెండింగ్

Ramoji Rao |

విధాత: మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ మీద ఏపీ సీఐడీ దూకుడుగా దాడులు చేయడం, అక్రమాలు అంటూ పలు విషయాలు వెలుగులోకి తీసుకురావడంతో పాటు దాదాపు రూ.1500 కోట్ల విలువైన ఆస్తులను సీఐడీ ఎటాచ్ చేయడం టీడీపీకి బాధించినట్లుంది. ఈమేరకు రామోజీరావుకు బాసటగా నిలిచేందుకు తెలుగుదేశం సిద్ధమైంది.

తెలుగు ప్రజల కీర్తి కిరీటం, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అయిన పెద్దమనిషిని ఇలాగే అవమానిస్తారా? ఇలాగే బాధపెడతారా అని ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసారు. దీంతో పాటు #TeluguPeopleWithRamojiRao పేరిట హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

వాస్తవానికి నకిలీ చిట్ సభ్యులను చేర్చుకుని భారీగా నిధులను తమ ఖాతాల్లోకి మళ్లించడం, చిట్ రిజిస్ట్రార్ రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించి చిట్ ఫండ్ చందాలు సేకరించడమే కాకుండా చిట్ ముగిశాక చందాదారులకు డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ అక్కడే డిపాజిట్ గా తీసుకోవడం, దానికి నామమాత్రపు వడ్డీ ఇవ్వడం.. ఇలా తీసుకున్న డిపాజిట్ డబ్బు వేర్వేరు వ్యాపారాల్లోకి మళ్లించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడినట్లు సీఐడీ తేల్చింది.

అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి ఆఫీసుల మీద దాడులు, ఖాతాలు, చిట్ వివరాలు అన్నీ సేకరించిన సీఐడీ ఇప్పుడు రామోజీని రోడ్డుకు లాగే పనిలో పడింది. ఇప్పటికే పలుమార్లు శైలజ కిరణ్, ఇంకా రామోజీని విచారించిన సీఐడీ మళ్ళీ విచారణకు రావాలని నోటీసులు పంపగా వాళ్ళు రాలేదు.

ఈ క్రమంలో మార్గదర్శి మీద దాడిని మీడియా మీద దాడి అన్నట్లుగా చెబుతూ ఈనాడు సైతం జగన్ ప్రభుత్వం మీద ఎదురుదాడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రామోజీకి తోడుగా తెలుగు ప్రజలు ఉంటారు అన్నట్లుగా పేర్కొంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Exit mobile version