Toll Plaza | టోల్ ప్లాజా( Toll Plaza ).. ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. ఎందుకంటే హైవేల( National Highways ) మీద ప్రయాణించే ప్రయాణికులకు( Passengers ) టోల్ ప్లాజాలు తారసపడుతుంటాయి. టోల్ ప్లాజాల వద్ద టోల్ ట్యాక్స్( Toll Tax ) వసూలు చేస్తుంటారు. ఎందుకంటే మనం తిరిగే రహదారులను మెరుగుపరిచేందుకు ఈ టోల్ ట్యాక్స్‌ను వసూలు చేస్తుంటారు. ఇలా దేశంలో టోల్ ట్యాక్స్ ఏడాదికి కోట్ల రూపాయాల్లో వసూలు అవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే దేశంలో ఎన్ని టోల్ ప్లాజాలు ఉన్నాయి..? ఏడాదికి ఎంత టోల్ ట్యాక్స్ వసూలు అవుతుంది..? దేశంలో అత్యంత ఖరీదైన టోల్ ప్లాజా ఏది..? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
Toll Plaza | జాతీయ రహదారులపై ( National Highways ) లేదా ఎక్స్‌ప్రెస్‌వే( Expressway )లపై టోల్ ప్లాజాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇలాంటి టోల్ ప్లాజా( Toll Plaza )లు దేశ వ్యాప్తంగా 1,087 ఉన్నట్లు కేంద్ర రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ టోల్ ప్లాజాలన్నీ 1.5 లక్షల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను కవర్ చేస్తున్నట్లు తెలిపింది. గత కొన్నేండ్ల నుంచి టోల్ ప్లాజాలు అధికంగా నిర్మితమవుతున్నాయి. ఇప్పుడున్న టోల్ ప్లాజాలలో 457 టోల్ ప్లాజాలు గత ఐదేండ్లలో నిర్మించినవే.
దేశ వ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలన్నీ ప్రతి రోజు 168.24 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. ఇక ఏడాదికి రూ. 61,408 కోట్లు సంపాదిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కల ద్వారా తెలిసింది. ఈ విషయాన్ని ఇటీవల లోక్‌సభలో కేంద్రం తెలిపింది.
దేశంలో అత్యంత ఖరీదైన టోల్ ప్లాజా ఇదే..
దేశంలో 1,087 టోల్ ప్లాజాలు ఉండగా, అత్యంత ఖరీదైన టోల్ ప్లాజా మాత్రం జాతీయ రహదారి 48(National Highway 48 )పై ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా( toll plaza ). ఈ టోల్ ప్లాజా గుజరాత్‌లోని భారథన గ్రామం( Bharathana village ) వద్ద ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి 48 దేశ రాజధాని ఢిల్లీ( Delhi )ని ఆర్థిక రాజధాని ముంబై( Mumbai ) నగరాన్ని కలుపుతుంది. దేశంలోనే అత్యంత రెవెన్యూను జనరేటింగ్ చేసే టోల్ ప్లాజాలలో ఇది ప్రథమ స్థానంలో ఉంది. ఈ టోల్ ప్లాజా ఏడాదికి రూ. 400 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది.