హిందూవులు హ‌లాల్ మాంసం తినొద్దు : కేంద్ర‌ మంత్రి గిరిరాజ్ సింగ్

హిందూవులు హ‌లాల్ మాంసం తినొద్ద‌ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సూచించారు

  • Publish Date - December 18, 2023 / 03:24 AM IST

పాట్నా : హిందూవులు హ‌లాల్ మాంసం తినొద్ద‌ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సూచించారు. కేవ‌లం ఝ‌ట్కా(ఒకే వేటుతో చంప‌బ‌డిన జంతువు) మాంసాన్ని మాత్ర‌మే తినాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆదివారం తన నియోజ‌క‌వ‌ర్గం బెగుసారాయిలో ఆయ‌న ప‌ర్య‌టించారు.

ప్ర‌తి హిందువు హిందూ ఆహార ఆచారాల‌ను పాటించాల‌ని, హ‌లాల్ మాంసానికి దూరంగా ఉండాల‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల చేత కేంద్ర మంత్రి ప్ర‌తిజ్ఞ చేయించారు. హ‌లాల్ మాంసం తినే ముస్లింల‌ను తాను అభినందిస్తాన‌ని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఆ విధంగానే హిందూవులు కూడా త‌మ హిందూ సంప్ర‌దాయాల‌ను పాటించాల‌ని, గౌర‌వించాల‌ని సూచించారు.

కేవలం ఝట్కా మాంసాన్ని విక్రయించేందుకు మాత్రమే రిటైల్ ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాల‌ని కేంత్ర‌మంత్రి ప్ర‌తిపాదించారు. యూపీలో హ‌లాల్ మాంసంపై నిషేధం ఉంద‌ని, బీహార్‌లోనూ ఆ విధంగా నిషేధం విధించాల‌ని కొన్ని వారాల క్రితం బీహార్ సీఎంకు లేఖ రాసిన‌ట్లు కేంద్ర మంత్రి తెలిపారు. హిందూవుల‌కు స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా దేవాల‌యాల‌ను సంద‌ర్శించాల‌ని కోరారు.