Visakhapatnam |
విధాత: ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో జగన్ తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఎవర్ని ఎక్కడ పోటీకి దించాలో చూస్తున్నారు. ఎమ్మెల్యేలు కొందర్ని ఎంపీలుగా పంపుతూ ప్రస్తుత ఎంపీలుకొందర్ని ఎమ్మెల్యేలుగా పంపేయోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో ఈసారి పట్టు నిలుపుకునేందుకు జగన్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు.
గత ఎన్నికల్లో సిటీలోని నాలుగు ఎమ్మెల్యే సీట్లనూ ఓడిపోయిన జగన్ లోక్ సభ స్థానాన్ని మాత్రం దక్కించుకున్నారు. టిడిపి అభ్యర్థి గీతం మూర్తి మనవడు శ్రీ భరత్ , జనసేన అభ్యర్థి సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణలను ఓడించి ఎంవివి సత్యనారాయణ ఎంపీసీటును గెలిచారు.
అయితే ఈసారి ఆయన్ను ఎమ్మెల్యేగా పంపేందుకు జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను విశాఖ ఈస్ట్ నియోజకవర్గానికి ఇంచార్జ్ గా నియమిస్తున్నారు. అంటే అక్కడ ఇప్పటికే రెండుసార్లు గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు మీద ఎంవీవీ సత్యనారాయణ పోటీ చేస్తారన్నమాట.
వాస్తవానికి వెలగపూడికి ఇక్కడ కాస్త మంచి పేరు ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటారని, కష్టనష్టాల్లో తోడుగా ఉంటారని, నిత్యం వారితో కలిసిమెలసి ఉంటారని, పిలవగానే పలుకుతారన్న పేరు ఉంది. అందుకే కులసమీకరణాలు కలిసిరాకున్నా అయన అక్కడ రెండుసార్లు గెలిచి మూడోసారి గెలిచేందుకు అయన సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఎంవివి మాత్రం కొత్తగా ఆయనమీద పోటీకి రెడీ అంటున్నారు.
ఇప్పుడు ఇద్దరూ కమ్మ సామాజికవర్గ నాయకులు తమ సత్తా చాటాలని చూస్తున్నారన్నమాట. ప్రస్తుతం ఈస్ట్ ఇంచార్జ్ గా ఉన్న అక్కరమాని విజయనిర్మలను జగన్ ప్రస్తుతానికి పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె వీఎంఆర్దీయే( విశాఖ నగరాభివృద్ధి) చైర్మన్ గా ఉన్నారు. మున్ముందు ఇంకెన్ని మార్పులు ఉంటాయో అని అందరూ చూస్తున్నారు.