Vijay Deverakonda | ‘లైగర్’ తర్వాత గర్జించడానికి సిద్ధమైన సింహం.. సింహం సైలెంట్‌గా ఉందంటే వేటాడటం మానేసిందని కాదు.. మరింత పట్టుదలతో మాటు వేసి వేటాడబోతుందని.. అదే పట్టుదలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఆ మధ్య అంచనాల మధ్య విడుదలైన ‘లైగర్’ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందు ఉన్న క్రేజ్‌ని నిలబెట్టుకోలేకపోయింది ఆ మూవీ. కానీ ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు విజయ్ దేవరకొండ. పాపం […]
Vijay Deverakonda |
‘లైగర్’ తర్వాత గర్జించడానికి సిద్ధమైన సింహం..
సింహం సైలెంట్‌గా ఉందంటే వేటాడటం మానేసిందని కాదు.. మరింత పట్టుదలతో మాటు వేసి వేటాడబోతుందని.. అదే పట్టుదలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఆ మధ్య అంచనాల మధ్య విడుదలైన ‘లైగర్’ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందు ఉన్న క్రేజ్‌ని నిలబెట్టుకోలేకపోయింది ఆ మూవీ.
కానీ ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు విజయ్ దేవరకొండ. పాపం విజయ్ పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరయ్యేసరికి, సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడకపోయే సరికి కాస్త డిజప్పాయింట్ అవడంతో పాటు.. కొన్ని రోజులుగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. అయితేనేం.. ఇప్పుడు అంతకు వేయింతలు రెట్టించిన ఉత్సాహంతో వరుసగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాల విషయానికి వస్తే..
రిలీజ్‌కి సిద్ధం అవుతున్న ‘ఖుషి’
ఒకప్పుడు పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించిన ‘ఖుషి’ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కి ఘన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి అదే పేరుతో వస్తున్న ‘ఖుషి’ మూవీలో విజయ్, సమంత జంటగా నటిస్తున్నారు. ఇది పూర్తి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా సెప్టెంబర్ 1తేదీన ప్రేక్షకులు ముందుకు రానుంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై డైరెక్టర్ శివ నిర్వాణ దర్మకత్వంలో వస్తున్న ఈ మూవీలోని పాటలు సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. నేపథ్య సంగీతం హేషమ్ అబ్దుల్ వహాబ్ కాగా ఈ మూవీ మొత్తం ఐదు భాషల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. త్వరలోనే విజయ్ సరికొత్త అవతారంలో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్‌తో విజయ్
పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ‘గీత గోవిందం’ మూవీ.. అంతకు ముందు అర్జున్ రెడ్డితో వచ్చిన మాస్ ఇమేజ్‌ని చెరిపేసి మంచి క్లాసీ హీరో లుక్‌ని విజయ్‌కి ఇచ్చింది. ఇప్పుడు ఆ సినిమా చేసిన దర్శకుడు పరుశురామ్‌తో మరో మూవీ చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ.
ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా చేస్తుంది. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా కూడా విజయ్‌కి మరో ‘గీతగోవిందం’ అవుతుందనేలా అప్పుడే ఇండస్ట్రీలో టాపిక్ వినబడుతుండటం విశేషం.
స్పై థ్రిల్లర్‌లో విజయ్..
ఇప్పటి వరకు చేసిన రెండు చిత్రాలతోనూ మంచి విజయాన్ని అందుకున్న గౌతమ్ తిన్ననూరితో విజయ్ ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో టాలీవుడ్ క్రష్ శ్రీలీల హీరోయిన్గా నటించనుంది. సితార సంస్థ ఈ మూవీ నిర్మిస్తోంది. వచ్చే వేసవిలో రాబోతున్న ఈ మూవీ పూర్తి స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఈ మూవీకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించనున్నారు.
సో.. ‘లైగర్’ విషయం పక్కన పెడితే.. విజయ్ నుంచి త్వరలో రాబోతున్న సినిమాలన్నీ మంచి బ్యానర్స్‌లో బలమైన కథలతో తెరకెక్కుతున్నవే. ‘లైగర్’ పరాజయంతో కసి మీద ఉన్న విజయ్ పవర్ ఏంటో చూపించే చిత్రాలే కాబట్టి.. అతనికి హిట్ ఎంత దూరంలో లేదు. వరుస హిట్స్ వచ్చిన రావచ్చు. కాబట్టి విజయ్ ఫ్యాన్స్ అస్సలు డీలా పడవద్దు. గర్జించడానికి సిద్ధమైపోవచ్చు.