303 మంది భారతీయుల అక్రమ రవాణా?

భారతీయులు 303 మంది ప్ర‌యాణిస్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అదుపులోకి తీసుకున్న‌ది.

  • Publish Date - December 23, 2023 / 08:58 AM IST

ప్రాన్స్ అదుపులో ఆ ప్రయాణికుల విమానం

దుబాయ్ నుంచి నిక‌రాగ్వాకు వెళ్తుండ‌గా

ఇంధన ఫిల్లింగ్‌కు వ్యాట్రీ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌

అనామకుడి సమాచారంతో ఫ్లైయింగ్ నిలిపివేత‌

రంగంలోకి దిగిన భార‌త దౌత్య కార్యాల‌యం


విధాత‌: భారతీయులు 303 మంది ప్ర‌యాణిస్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అదుపులోకి తీసుకున్న‌ది. విమానంలోని .ప్ర‌యాణికులంతా మానవ అక్రమ రవాణా బాధితుల‌ని స‌మాచారం అందడంతో విమాన‌ ఫ్లైయింగ్ నిలిపివేసింది. ఫాన్స్‌లోని భార‌త దౌత్య కార్యాల‌యానికి స‌మాచారం అందించింది. రంగంలోకి దిగిన భార‌త అధికారులు ఈ ఘ‌ట‌నలో ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.


ఇంత‌కీ ఏమి జరిగిందంటే.. రొమేనియాకు చెందిన లెజెండ్ సంస్థ ఎయిర్‌బస్ ఏ340 విమానం 303 మంది ప్రయాణికుల‌తో గురువారం దుబాయి నుంచి నికరాగ్వాకు బయలుదేరింది. ఇంధనం నింపుకొనేందుకు ప్యారిస్‌ సమీపంలోని వ్యాట్రీ ఎయిర్‌పోర్టులో విమానం దిగింది. ఇంత‌లో గుర్తుతెలియ‌ని వ్య‌క్తి విమానంలోని ప్ర‌యాణికులంతా భార‌త్‌కు చెందిన మానవ అక్రమ రవాణా బాధితుల‌ని స‌మాచారం ఇవ్వ‌డంతో ఫ్రాన్స్ అదికార యంత్రాంగం అప్ర‌మ‌త్తమైంది.


వెంటనే ఫ్రాన్స్ పోలీసులు విమానాన్ని చుట్టుముట్టారు. అందులోని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మిగతా ప్రయాణికుల‌ను మొదట విమానంలోనే ఉంచారు. ఆ తర్వాత టెర్మినల్ భవనంలో బస ఏర్పాట్లు చేసిన‌ట్టు అధికారులు తెలిపారు. అమెరికా లేదా కెనడాలోకి అక్రమంగా ప్రవేశించే ప్లాన్‌లో భాగంగా ప్రయాణికులు ముందుగా మధ్య అమెరికా వెళ్తున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.


ఈ ఘటనపై ఫ్రాన్స్‌లో భారత రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది. భారతీయ అధికారులు అక్కడకు చేరుకుని, ప్రయాణికులకు అవసరమైన ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు. ‘ఫ్రాన్స్ అధికారులు 303 మందితో కూడిన విమానం అదుపులోకి తీసుకున్న విషయం గురించి మాకు తెలియజేశారు. దుబాయ్ నుంచి నికరాగ్వా వెళ్తున్న విమానంలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. ఫ్రెంచ్ విమానాశ్రయంలో సాంకేతికంగా నిలిపివేశారు.


దౌత్య కార్యాలయ బృందం అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్న‌ది. ప్రయాణికుల క్షేమ సమాచారంపై కూడా ఆరా తీశారు’ అని ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్ర‌వారం ట్విట్ట‌ర్‌లో తెలిపింది. ఈ పరిణామాలపై లెజెండ్ ఎయిర్‌లైన్స్ స్పందించింది. తాము ఎటువంటి తప్పు, నేరం చేయలేదని తెలిపారు. ప్రాసిక్యూటర్లు అభియోగాలు నమోదు చేస్తే విమానయాన సంస్థ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఆమె చెప్పారు.

Latest News