Site icon vidhaatha

Mamata Banerjee | హీరో రాకేష్ రోష‌న్‌ను చంద్రునిపైకి పంపిన మ‌మ‌తా బెన‌ర్జీ..

Mamata Banerjee | విధాత‌: ఒక ప్రముఖ విష‌యంపై మాట్లాడేట‌పుడు త‌ప్పులు దొర్లితే అంద‌రిలోనూ న‌వ్వుల‌పాలు కావాల్సి వ‌స్తుంది. అలా మాట్లాడింది ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కులైతే వారి మీద ట్రోలింగ్స్ మాములుగా ఉండ‌వు. ఈ సారి త‌ప్పు మాట్లాడింది ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee) . చంద్ర‌యాన్-3 (Chandrayan-3) ల్యాండ‌ర్ జాబిల్లిని తాక‌డానికి కొన్ని గంట‌ల ముందు ఆమె ఒక కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. ‘భార‌త శాస్త్రవేత్త‌లు సాధించ‌బోయే విజ‌యానికి నా ముంద‌స్తు శుభాభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నా. అంత‌రిక్ష విజ‌యాల‌కు శాస్త్రవేత్త‌ల‌కు క్రెడిట్ ద‌క్కాలి.

దేశ‌ప్ర‌జ‌ల‌కు ద‌క్కాలి. రాకేష్ రోష‌న్ చంద్రునిపైకి వెళ్లిన‌పుడు.. అక్క‌డి నుంచి మ‌న దేశం ఎలా క‌న‌పడుతోంద‌ని అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరాగాంధీ ఆయ‌న‌ను అడిగారు’ అని త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. నిజానికి అంత‌రిక్షంలోకి వెళ్లిన వ్యోమ‌గామి రాకేష్ శ‌ర్మ‌ (Rakesh Sharma) . రాకేష్ రోష‌న్ బాలీవుడ్ హీరో.. హృత్రిక్ రోష‌న్ తండ్రి. దీంతో మ‌మ‌తా బెన‌ర్జీ మాట్లాడిన ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్‌లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. వేల కొద్దీ మీమ్స్‌ను రూపొందించి నెటిజ‌న్లు ఒక ఆట ఆడుకుంటున్నారు.

కొంత‌మంది రాకేష్ రోష‌న్.. స్పేస్ సూట్ ధ‌రించి అంత‌రిక్షం నుంచి మ‌మ‌తా బెన‌ర్జీకి థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు వీడియోలు ఎడిట్ చేశారు. ఆవిడ మ‌న దేశానికి ప్ర‌ధాని కావాల‌నుకుంటున్నారా అని మ‌రొక‌రు వ్యంగ్యంగా ప్ర‌శ్నించారు. ఒక‌సారి గ‌తాన్ని ప‌రిశీలిస్తే .. ఇందిరాగాంధీతో సంభాషించిన భారత వ్యోమ‌గామి పేరు రాకేష్ శ‌ర్మ‌. ఆయ‌న 1984లొ తొలి సారి అంత‌రిక్షంలోకి ప్ర‌వేశించిన భార‌తీయుడు. మ‌మ‌త చెప్పిన‌ట్లు ఆయ‌న చంద్రునిపై కాలు పెట్ట‌లేదు.

అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఏ భార‌తీయుడూ చంద్రుని వ‌ద్ద‌కు వెళ్ల‌లేదు. ఆయ‌న అంత‌రిక్షంలో ఉన్న స‌మ‌యంలో భార‌తీయులంద‌రి త‌ర‌ఫున అప్ప‌టి ప్ర‌ధాని ఇందిర.. రాకేష్ శ‌ర్మ‌తో సంభాషించారు. అంత‌రిక్షం నుంచి భార‌త్ ఎలా క‌నిపిస్తోంద‌ని అడ‌గ్గా.. సారే జ‌హా సె అచ్ఛా… (మిగిలిన ప్ర‌పంచం కంటే ఉన్న‌తంగా) అని ఆయ‌న‌ బ‌దులిచ్చారు.

అయితే చంద్ర‌యాన్ 3పై మాట్లాడుతూ పొర‌ప‌డిన వారిలో మ‌రికొంద‌రు రాజ‌కీయ నాయ‌కులూ ఉన్నారు. రాజ‌స్థాన్ క్రీడ‌ల శాఖ మంత్రి అశోక్ చంద్‌నా మాట్లాడుతూ.. చంద్ర‌యాన్ 3ని మాన‌వ స‌హిత యాత్ర‌గా పొర‌బ‌డి చంద్ర‌యాన్ 3 ప్ర‌యాణికుల‌కు శుభాకాంక్ష‌లు అని పేర్కొన్నారు. ఇదే విధంగా పొర‌బ‌డిన మ‌రో నేత ఎస్‌బీఎస్‌పీ చీఫ్ రాజ్‌భ‌ర్‌.. చంద్ర‌యాన్ 3లో వెళ్లిన శాస్త్రవేత్త‌లు భూమిపైకి రాగానే దేశం యావ‌త్తు వారికి ఘ‌న స్వాగతం ప‌లుకుతుంద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించారు.

Exit mobile version