ఫైనల్ లో అస్ట్రేలియాపై 5 వికెట్లతో గెలుపు
ఎట్టకేలకు 27ఏళ్లకు రెండో ఐసీసీ టైటిల్
విధాత : ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (ICCWorld Test Championship-2025) ఫైనల్ మ్యాచ్ లో అస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా సంచలన విజయం సాధించింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా తొలిసారిగా డబ్ల్యుసీ టెస్టు ఛాంపియన్ షిప్ కప్ ను అందుకుంది. అంతేకాకుండా 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాతా 27ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతు రెండో ఐసీసీ టైటిల్ సాధించింది. ఫైనల్ మ్యాచ్ లలో తడబడి ఓడిపోతారన్న పేరుకు సఫారీ టీమ్ చెక్ పెట్టినట్లయ్యింది.
లండన్ లార్డ్స్ వేదికగా జరిగిన డబ్ల్యుసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా నిర్ధేశించిన 282 పరుగుల విజయలక్ష్యాన్ని దక్షిణాఫ్రికా శనివారం నాల్గవ రోజు ఆటలో మరో ఐదు వికెట్లు మిగిలి ఉండగానే చేధించింది. సఫారీ బ్యాటర్ మార్ క్రమ్ 136 పరుగులతో జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. అతను 207బంతుల్లో 14ఫోర్లతో 136పరుగులు చేసి హెజిల్ వుడ్ బౌలింగ్ లో ఐదో వికెట్ గా అవుటయ్యాడు. బవుమా, మార్ క్రమ్ లు మూడో వికెట్ కు 147పరుగులు జోడించారు. మార్ క్రమ్ అవుటయ్యే సమయానికి అప్పటికి విజయానికి మరో ఆరు పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. డెవిడ్ బెడింగ్ హమ్ (21*), వెరెన్నే (4*) పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ బవుమా(66), ముల్డర్ (27), స్టబ్స్ (8), రికిల్టన్(6) పరుగులు చేశారు. అసీస్ బౌలర్లలో స్టార్క్ 3, కమిన్స్ , హెజల్ వుడ్ చెరో వికెట్ సాధించారు.
మూడో రోజు ఆటలో దక్షిణాఫ్రికా 213/2 పరుగుల వద్ధ నిలవగా..గెలుపు కోసం మరో 69పరుగులు సాధించేందుకు నాల్గవ రోజు ఆట ప్రారంభించింది. అయితే వెనువెంటనే తన స్కోరుకు మరొక్క పరుగు మాత్రమే జోడించి కెప్టెన్ బవుమా(66) అసీస్ పేసర్ కెప్టెన్ కమిన్స్ బౌలింగ్ లో వెనుతిరిగాడు. స్టబ్స్ సైతం(8)పరుగులకే స్టార్క్ బౌలింగ్ లో అవుటయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికాపై అసీస్ బౌలర్లు పట్టు బిగించే ప్రయత్నం చేశారు. అయితే ఓ ఎండ్ లో సెంచరీ హీరో ఐదెన్ మార్‌క్రమ్ నిలబడటంతో దక్షిణాఫ్రికా మిగతా బ్యాటర్ల సహకారంతో 83.4ఓవర్లలో 282పరుగులు సాధించి ఐదు వికెట్లతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా తొలి ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ కప్ సాధించింది.
మ్యాచ్ వివరాలు :
ఈ ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో అస్ట్రేలియా 212పరుగులు చేసింది. స్టివెన్ స్మిత్(66), వెబ్ స్టర్(72) పరుగులు చేయగా..సఫారీ బౌలర్లలో రబాడా 5, జన్సెన్ 3, మహారాజ్, మార్ క్రమ్ తలో వికెట్ తీశారు. బదులుగా దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 138పరుగులకే అలౌట్ అయ్యింది. బెడింగ్ హమ్ 45, కెప్టెన్ బవుమా 36పరుగులతో రాణించారు. అసీస్ బౌలర్లలో కెప్టెన్ కమిన్స్ 6, స్టార్క్ 2, హెజల్ వుడ్ ఒక వికెట్ సాధించారు. అసీస్ రెండో ఇన్నింగ్స్ లో 207పరుగులు చేసింది. స్టార్క్ 58, క్యారీ 43రాణించారు. సఫారీ బౌలర్లలో రబాడ 4, ఎంగిడి 3, యన్సెన్, ముల్డర్,మార్ క్రమ్ తలో వికెట్ సాధించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యతను కలుపుకుని ఆసీస్ జట్టు దక్షిణాఫ్రికాకు 282పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. తొలి రెండు రోజుల్లో ఏకంగా 28వికెట్లు పడిన పిచ్ పై దక్షిణాఫ్రికా బ్యాటర్లు ముఖ్యంగా మార్ క్రమ్, బవుమాలు మూడో రోజు ఆటలో నిలకడగా రాణించడంతోనే మరో రోజు ఆట మిగిలి ఉండగానే 5వికెట్లతో సఫారీ జట్టు విజయాన్ని అందుకోగలిగింది.