Girl head struck in Window | భువనేశ్వర్ : రెండో తరగతి చదువుతున్న ఓ బాలిక తరగతి గదిలోనే ఉండిపోయింది. గదిలో ఎవరూ లేరని భావించిన టీచర్లు.. స్కూల్‌కు తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీంతో బాలిక తరగతి గదిలో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా, కిటికీ ఇనుప కడ్డీల్లో ఆమె తల ఇరుక్కుపోయింది. ఈ క్రమంలో ఆ పసిబిడ్డ 12 గంటలకుపైగా నరకయాతన అనుభవించింది. ఈ ఘటన ఒడిశాలోని కియోంజార్ జిల్లాలో వెలుగు చూసింది.
కియోంజార్ జిల్లా అంజర్‌కు చెందిన ఓ ఎనిమిదేండ్ల బాలిక రోజు మాదిరిగానే గురువారం స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లింది. ఆమె రెండో తరగతి చదువుతుంది. అయితే అదే రోజు సాయంత్రం బాలిక తరగతి గదిలోనే ఉండిపోయింది. సాయంత్రం 4 గంటలకు టీచర్లు కూడా స్కూల్‌కు తాళం వేసుకుని వెళ్లిపోయారు.
బాలిక తర్వాత బయటకు వద్దామని చూసేసరికి క్లాస్ రూమ్‌కు తాళం వేసి ఉంది. దీంతో అక్కడున్న కిటికీలో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. తల కిటికీ ఇనుప కడ్డీల్లో ఇరుక్కుపోయింది. దీంతో ఆ రోజు రాత్రంతా అంటే దాదాపు 12 గంటలకు పైగా నరకయాతన అనుభవించింది.
శుక్రవారం ఉదయాన్నే స్కూల్ వద్దకు చేరుకున్న వంట మనిషి.. బాలికను గమనించాడు. దీంతో టీచర్లను, గ్రామస్తులను అప్రమత్తం చేశాడు. కిటికీని తొలగించి బాలిక ప్రాణాలను కాపాడారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ఎలాంటి ప్రాణపాయం లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో బాలిక పెరేంట్స్, టీచర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.