Natural Farming | హిమాచల్ ప్రదేశ్( Himachal Pradesh ) కులు జిల్లాలోని తలగాలి గ్రామానికి( Talagali Village ) చెందిన అనిత నేగి( Anita Negi ).. తనకున్న వ్యవసాయ పొలంలో ఫెర్టిలైజర్స్( fertilizers ), పెస్టిసైడ్స్ pesticides ) ఉపయోగించి పంటలు పండిచేది. ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడకం వల్ల ఆమె ఎలర్జీతో బాధపడేది. అంతేకాకుండా ఆమెకు తలనొప్పి( Headache ) కూడా వచ్చేది. ఇలా సాగు చేయడం వల్ల ఆశించినంత దిగుబడి లేదు.. పెద్దగా లాభాలు కూడా రావడం లేదు. అల్లం, టమాటో, కాలిఫ్లవర్, ఫ్రెంచ్ బీన్స్ పండించేది కానీ పెద్దగా లాభాల్లేవు. 2000 నుంచి 2013 వరకు అంటే దాదాపు 13 ఏండ్లు వ్యవసాయం చేసినా.. రూపాయి కూడా వెనుకేయలేదు. ఇక లాభం లేదనుకుని వ్యవసాయంపై ఆమె ఆసక్తి చూపించలేదు.
మళ్లీ తిరిగి 2018లో వ్యవసాయంపై దృష్టి సారించింది. నేచురల్ ఫామింగ్ క్యాంప్‌కు హాజరైంది. అక్కడ రెండు రోజుల పాటు వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయంపై సంపూర్ణ అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంతో 18 ఏండ్ల తర్వాత అనిత సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇక తన పెరట్లోనే ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు పండించడం ప్రారంభించింది. జీవామృతం( Jeevamrut ), బీజామృతం( Bijamrita ), మల్చింగ్, సాయిల్ ఏరేషన్ విధానంలో కూరగాయల సాగు చేశారమె. జీవామృతాన్ని ఆవు పేడ( Cow Dung ), మూత్రం, బెల్లం, మట్టితో తయారు చేసేది. దీన్ని పెరట్లో పెంచుతున్న కూరగాయలకు ఎరువుగా వేసేది. ఇక బీజామృతాన్ని క్రిమికీటకాల నివారణకు వినియోగించేది. బీజామృతం తయారీ కోసం వేప ఆకులు, గ్రీన్ చిల్లిస్ వినియోగించేది. ఈ విధానాల ద్వారా ఇంటి పెరట్లోనే కూరగాయలు పండించి.. ఎనిమిది నుంచి పది నెలల కాలంలో పంట చేతికి అందేది. ఈ విధానంలో అనితకు ఎలాంటి ఎలర్జీ లేదు.. తలనొప్పి అసలే లేదు. అంతేకాదు.. పెరట్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు, ఆకుకూరలు కూడా ఎంతో రుచిగా ఉండేవి. ఆమె కుటుంబ సభ్యులు కూడా మెచ్చుకున్నారు.
ఇక అప్పట్నుంచి ఆమె ప్రకృతి వ్యవసాయంలో వెనుకడగు వేయలేదు. ఇప్పుడు అనిత తనకున్న 2 ఎకరాల్లో నేచురల్ ఫామింగ్ ద్వారా ఆపిల్స్( Apples ) పండిస్తున్నారు. ఆపిల్‌తో పాటు రేగు పండ్లు, తునికి పండ్లు కూడా పండిస్తుంది ఆమె. ఈ సాగు ద్వారా ఏడాదికి రూ. 14 లక్షలు సంపాదిస్తుంది అనిత. మరో రెండు ఎకరాల్లో ఆపిల్, తునికి, రేగు మొక్కల నర్సరీ నిర్వహిస్తున్నారు. ఈ పండ్ల మొక్కలు అమ్మి మరో రూ. 45 లక్షలు సంపాదిస్తుంది ఏడాదికి. ఇలా ఏడాదికి నాలుగు ఎకరాల్లో రూ. 60 లక్షలు సంపాదిస్తుంది.
అనిత్ పొలంలో ఒక్కో యాపిల్ చెట్టు 35 కేజీల వరకు దిగుబడిని ఇస్తుంది. కెమికల్స్ ఉపయోగించి సాగు చేసినప్పుడు దిగుబడి 20 కేజీలకు మించకపోయేది అని అనిత గుర్తు చేసింది. తన పొలంలో 1200 యాపిల్ చెట్లు, 60 తునికి పండ్ల చెట్లు, 200 వరకు రేగు చెట్లు ఉన్నట్లు తెలిపింది. ఇక వీటి మధ్య ఎండకాలం అంతరపంటగా టమాటో సాగు చేస్తున్నట్లు పేర్కొంది. కాలిఫ్లవర్, బీన్స్‌తో పాటు ఇతర కూరగాయలను పండిస్తుంది ఆవిడ. చలికాలంలో అల్లం సాగు చేస్తుంది.