Bihar SIR controversy | బీహార్‌లో తొలగించిన 65 లక్షల ఓట్లకు సంబంధించిన వివరాలు, అవి ఎందుకు తొలగించామో పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచుతామని సుప్రీంకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం తెలిపింది. వలస పోవడం, చనిపోవడం వంటి కారణాలు చూపుతూ ఎన్నికల సంఘం ఈ పేర్లను తొలగించిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం తరఫున విచారణకు హాజరైన సీనియర్ అడ్వొకేట్ రాకేశ్ ద్వివేదీ.. ఇప్పటికే పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లకు జాబితాలను అందించామని తెలిపారు. అదే జాబితాలను ఆన్‌లైన్‌లోనూ ఉంచుతామని పేర్కొన్నారు. ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా ఓటర్ల వివరాలను అందులో పొందవచ్చన్నారు.
2025 ఓటరు జాబితాలో ఉండి.. తొలగింపునకు గురైన సుమారు 65 లక్షల ఓటర్ల వివరాలను అన్ని జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాలతోపాటు.. రాష్ట్ర చీఫ్‌ఎలక్టోరల్ అధికారి కార్యాలయంలోనూ ప్రదర్శించాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి ధర్మాసనం ఆదేశించింది. ఈ వివరాలు పోలింగ్ కేంద్రాల వారీగా ఉండాలని, ఓటరు ఎపిక్ నంబర్ ఆధారంగా వివరాలు పొందేలా ఉండాలని స్పష్టం చేసింది. అంతేకాదు.. ముసాయిదా ఓటరు జాబితా నుంచి ఎందుకు తొలగించారనే కారణంగా తెలియజేయాలని పేర్కొన్నది. తొలగింపునకు గురైన ఓటర్ల వివరాలు, కారణాలను సంబంధిత పంచాయతీ, బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసులలో ప్రదర్శించాలని సుప్రీంకోర్టు తెలిపింది. అవన్నీ ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియకు విస్తారంగా ప్రాచుర్యం కల్పించాలని తెలిపింది. ఇంగ్లిష్ భాషతోపాటు.. స్థానిక భాషల్లోనూ ప్రజా నోటీసుల ద్వారా జనంలోకి తీసుకువెళ్లాలని పేర్కొన్నది. దూరదర్శన్, ఆలిండియా రేడియోతోపాటు.. ఆయా జిల్లాల ఎలక్టోరల్ అధికారులకు ఏమన్నా సామాజిక మాధ్యమాలు ఉంటే వాటిలోనూ ప్రదర్శించాలని ధర్మాసనం తెలిపింది.