దేశంలో 40 ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు … అన్నీ ఫేక్‌ కాల్సేనని తేల్చిన బాంబు తనిఖీ బృందాలు

దేశంలోని పలు విమానాశ్రయాలకు మంగళవారం బాంబు బెదిరింపులు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాంబు బెదిరింపులతో పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. బాంబు బెదిరింపుల నేపథ్యంలో అన్ని ఎయిర్‌పోర్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

  • Publish Date - June 18, 2024 / 06:22 PM IST

న్యూఢిల్లీ : దేశంలోని పలు విమానాశ్రయాలకు మంగళవారం బాంబు బెదిరింపులు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాంబు బెదిరింపులతో పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. బాంబు బెదిరింపుల నేపథ్యంలో అన్ని ఎయిర్‌పోర్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మంగళవారం ఉదయం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయి వెళ్లాల్సిన విమానంలో బాంబు ఉన్నదంటూ ఈమెయిల్‌లో బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే ఆ విమానంలో పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఇదే మెయిల్‌ ఖాతా నుంచి దేశంలోని 40 ఎయిర్‌పోర్టులకు మధ్యాహ్నం 12.40 గంటల ప్రాంతంలో బెదిరింపు మెయిల్స్‌ వెళ్లినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చెన్నై నుంచి దుబాయ్‌ వెళ్లే ఎమిరేట్స్‌ ఫ్లైట్‌ ఈ బెదిరింపులతో రెండు గంటలు ఆలస్యమైంది. 9.50కి ఈ విమానం బయల్దేరాల్సి ఉన్నది. మరోవైపు కోయంబత్తూర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు కూడా బెదిరింపు మెయిల్‌ అందింది. కేంద్ర పరిశ్రమల భద్రతాదళం (సీఐఎస్‌ఎఫ్‌) సిబ్బంది జాగిలాల సహకారంతో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి, నకిలీ బెదిరింపుగా తేల్చారు. అనంతరం పాట్నా ఎయిర్‌పోర్ట్‌ సైతం ఇదే తరహా ఆందోళనను ఎదుర్కొన్నది. ఈ బెదిరింపులపై విచారణ జరుపుతున్నామని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నదని పాట్నా ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ తెలిపారు. జైపూర్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన బెదిరింపు కాల్‌ కూడా నకిలీదేనని తేలింది. ఎయిర్‌పోర్టులో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించామని, అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని అధికారులు తెలిపారు. గుజరాత్‌లోని వడోదర ఎయిర్‌పోర్టుకు కూడా బెదిరింపు మెయిల్‌ రావడంతో తనిఖీలు చేసి, భద్రతను కట్టుదిట్టం చేశారు.

Latest News