Atishi । ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రి కాబోతున్న అతిశి రాజకీయ ఎదుగుదల అత్యంత వేగంగా చోటుచేసుకున్నది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మనీశ్ సిసోడియాకు విద్యాశాఖ సలహాదారుగా ఉన్న అతిశి ఇప్పుడు రాష్ట్రానికే ముఖ్యమంత్రి కాబోతున్నారు. 43 ఏళ్ల వయసున్న అతిశి.. కేజ్రీవాల్ ప్రభుత్వంలో అత్యధిక శాఖలను నిర్వహించారు. గతంలో ఢిల్లీకి కాంగ్రెస్ తరఫున షీలా దీక్షిత్, అనంతరం బీజేపీ తరఫున సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వాస్తవానికి ఆమె తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు అతిశి మార్లేన్ సింగ్. కానీ.. రాజకీయాల్లోకి వచ్చే ముందు ఆమె తన పేరును అతిశిగా మార్చుకున్నారు. దాని వెనుక ఆసక్తికర అంశాలు ఉన్నాయి.
మరికొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అతిశి పెద్ద ఎత్తునే బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నది. ఆరు నెలలుగా కేజ్రీవాల్ జైల్లో ఉండటంతో ప్రభుత్వ విధానపర నిర్ణయాలు మూలనపడ్డాయి. దీంతో నిరంతరం క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తూ కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ ఢిల్లీ ప్రగతిని ముందుకు నడిపించాల్సి ఉన్నది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన, ఎలక్ట్రిక్ వాహనాల 2.0 పాలసీ తదితరాలు కీలకంగా ఉన్నాయి. అతిశి.. ఆప్ వ్యవస్థాపక సభ్యురాలు. పార్టీ విధానాల రూపకల్పనలో ఆమె కీలక పాత్ర పోషించారు. 2013 మ్యానిఫెస్టో తయారీ కమిటీలో కీలక సభ్యురాలిగా ఉన్నారు.
రాజకీయాల్లోకి రాక ముందు ఆమె మధ్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో ఆర్గానిక్ వ్యవసాయం, ప్రగతిశీల విద్యపై కేంద్రీకరించారు. కొంతకాలం ఏపీలోని రుషికొండలోని ఒక పాఠశాలలో చరిత్ర, ఇంగ్లిష్ బోధించారు. రాజకీయ నాయకురాలిగా ఆమె పరివర్తనలో ఇవి ప్రధాన భూమిక పోషించాయని పార్టీ నేత ఒకరు అన్నారు. 2013లోనే ఆప్‌లో చేరినా.. ఆమె రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగ సలహాదారుగా పనిచేశారు. 2019లో తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్‌పై పో టీ చేయడం ద్వారా ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చారు. అయితే.. ఆ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు. 2020లో కల్కజీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన మనీశ్ సిసోడియా అరెస్టయి, పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆమెను కేజ్రీవాల్ రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇది ఆమెకు రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం కల్పించింది. అనంతరం కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్లాల్సి రావడంతో దాదాపు ప్రభుత్వ బాధ్యతనంతా తానే మోయడమే కాదు.. ప్రత్యర్థి దాడుల నుంచి ప్రభుత్వాన్ని కాపాడుతూ వచ్చారు. ఢిల్లీ నీటి సంక్షోభం సమయం కావచ్చు.. పార్టీ రాజ్య సభ సభ్యురాలు స్వాతి మలివాల్ దాడి ఉదంతం కావచ్చు.. ఆమె రాజకీయ విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు. ఢిల్లీ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న సమయంలో హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటా కోసం ఆమె నిరాహార దీక్షకు సైతం దిగారు. అతిశి ఢిల్లీ క్యాబినెట్‌లో కీలక మంత్రి మాత్రమే కాదు.. ఆప్ కీలక నేత కూడా.
ఢిల్లీ విద్యారంగ విప్లవంలో అతిశి కీలక భాగస్వామిగా ఉన్నారు. ఢిల్లీలోని ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలనే మార్చివేయడంలో, సమాచార హక్కు చట్టం కింద స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఏర్పాటులో తన వంతు పాత్ర పోషించారు. 2022లో ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లడిన అతిశి.. పట్టణ పరిపాలనలో ఢిల్లీ మోడల్‌ను అంతర్జాతీయ స్థాయిలో హైలైట్ చేశారు.
ఆమె తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్త వాహి.. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు. ఢిల్లీ యూనివర్సిటీ సెయింట్ స్టీఫెన్ కాలేజీలో చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందిన అతిశి.. ఆ ఏడాది బ్యాచ్‌లో టాపర్‌గా నిలిచారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలంలో విద్య, చరిత్రలో ఆమె పీజీలు చేశారు.
ఇక ఆమె పేరు మార్చుకోవడం వెనుక ఆసక్తికర కథే ఉన్నది. వాస్తవానికి ఆమె తల్లిదండ్రులు పెట్టిన పేరు అతిశి మార్లేనా సింగ్. అయితే.. మార్ లేనా అనేది.. కమ్యూనిస్టు సిద్ధాంత కర్తలు మార్క్స్, లెనిన్ పేర్లను తలపించేవిగా ఉంది. 2018 వరకూ మార్లేనా పేరు కొనసాగించుకున్నారు. కానీ.. తన పేరులో ఎలాంటి రాజకీయ ప్రస్తావనలు ఉండకూడదని భావించిన అతిశి.. అన్ని రికార్డుల్లో తన పేరును అతిశిగా అధికారికంగా మార్చుకున్నారు.