Tragedy Video | నొయిడాలో చనిపోయిన టెక్కీ యువరాజ్‌ మెహతా ఆఖరి క్షణాలు.. గుండెను పిండేసే వీడియో..

రెండేళ్లుగా యథేచ్ఛగా సాగిన నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నది. గత శనివారం నొయిడాలోని 150వ సెక్టర్‌లో ప్రమాదానికి గురైన టెకీ యువరాజ్‌ మెహతా ఆఖరి క్షణాల వీడియో ఒకటి చూసేవారి హృదయాన్ని కలచివేస్తున్నది.

Tragedy Video |  తాను చనిపోతున్నానని తనకు తెలుసు. అతడు చనిపోతున్నాడని అతడిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నవారికీ తెలుసు. వందమంది సహాయ సిబ్బంది.. కానీ.. ఒక్క ప్రాణాన్ని కాపాడలేక పోయారు. నొయిడాలోని 150వ సెక్టర్‌లో చోటు చేసుకున్న విషాద ఘటనకు సంబంధించి.. ఒళ్లు గగుర్పొడిచే కొత్త వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. అతడిని రక్షించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవన్నీ వృథా అయిపోయాయి. ఈ వీడియో చిమ్మచీకటిలో తీసింది. అందులో యువరాజ్‌ మెహతా తన సెల్‌ఫోన్‌ టార్చ్‌ ఆన్‌ చేసి.. తాను ఇక్కడే ఉన్నానంటూ చూపించడం కనిపిస్తుంది. దాదాపు గంటన్నరపాటు మృత్యువుతో పోరాడిన యువరాజ్‌.. చివరకు ప్రాణాలు వదిలాడు.. అందరూ చూస్తుండగానే!!

అది శనివారం. జనవరి 17 అర్థరాత్రి 12 గంటల సమయం. నొయిడాలోని 150వ సెక్టర్‌కు చెందిన 27ఏళ్ల యువరాజ్‌ మెహతా.. తన గ్రాండ్‌ విటారా కారును డ్రైవ్‌ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ.. అక్కడ తన కోసం మృత్యువు పొంచి ఉందన్న విషయాన్ని గ్రహించలేక పోయాడు. అక్కడ లోతుగా తవ్వి, నీటితో నిండిపోయిన భారీ గొయ్యి ఉంది. అత్యంత ప్రమాదకరమైన ఆ గోతి చుట్టూ ఎలాంటి బారికేడ్స్‌ను నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయలేదు. రిఫ్లెక్టర్స్‌ కానీ.. హెచ్చరిక బోర్డులు కానీ లేవు. పైగా దట్టమైన పొగమంచు. కన్ను పొడుకున్నా కనిపించని దారి. ఈ పరిస్థితిలో ప్రమాదవశాత్తూ యువరాజ్‌ కారు ఆ గోతిలో పడిపోయింది. యువరాజ్‌కు ఈత రాదు. అతికష్టం మీద కారు పైకి చేరుకున్నాడు. సరిగ్గా 12.04 గంటలకు తండ్రికి ఫోన్‌ చేసి, ప్రమాదం విషయం చెప్పాడు. తన ఫోన్‌ నుంచి వాట్సాప్‌లో లొకేషన్‌ పంపించాడు. తనను ఎవరైనా కాపాడుతారేమోనన్న ఆశతో తన సెల్‌ఫోన్‌ టార్చ్‌ ఆన్‌ చేసి.. అటూ ఇటూ ఊపుతూ ఉన్నాడు. క్షణాలు గడుస్తుంటే.. కారు మరింత కిందికి మునిగిపోతున్నది. ఒక వైపు ఎముకలు కొరికే చలి.. ఏమీ కనిపించకుండా దట్టమైన పొగమంచు. రక్షించండి అంటూ కేకలు వేస్తున్నాడు. ఆ సమయానికి అక్కడ గుమిగూడిన వారికి అతడి అరుపులు వినిపించాయి. ‘అతడు కాపాడండి.. అంటూ అరవడం మాకు స్పష్టంగా వినిపించింది. కానీ మేమేమీ చేయలేపోయాం’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

తన కుమారుడి నుంచి ఫోన్‌ రాగానే తండ్రి రాజ్‌కుమార్‌ మెహతా.. వెంటనే ఎమర్జెన్సీ సహాయం కోసం ఫోన్‌ చేశాడు. 12.15కల్లా పోలీసులు స్పాట్‌కు చేరుకున్నాడు. 12.50 గంటలకు అగ్నిమాపక సిబ్బంది సైతం చేరుకున్నారు. 1.55 గంటలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సైతం చేరుకున్నారు.. అంతా కలిసి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. దాదాపు గంటన్నరపాటు మృత్యువును ధిక్కరించిన యువరాజ్‌.. తన పోరాటాన్ని కొనసాగించలేకపోయాడు. తెల్లవారుజాము 4.30 వరకూ అలా వెతుకుతూనే ఉన్నారు. చివరకు యువరాజ్‌ మృతదేహం దొరికింది. మంగళవారం సాయంత్రం అతడి కారును వెలికి తీశారు. ఆ కారు నిండా.. చెత్తాచెదారం. కొన్ని నెలల తరబడి ఆ గోతిని అలా వదిలేయడంతో అందులో చెత్త పేరుకుపోయిన విషయాన్ని ఆ కారు ధృవీకరిస్తున్నది.

నాన్నా.. కాపాడు..

యువరాజ్‌ తండ్రి రాజ్‌కుమార్‌ మెహతా రిటైర్డ్‌ సీబీఐ డైరెక్టర్‌. ఆయన ఉండేది ఘటనాస్థలానికి కూత వేటుదూరంలోనే. తన కొడుకు నుంచి ఫోన్‌ రాగానే అధికారులను అప్రత్తం చేసిన రాజ్‌.. ఆ వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. దట్టమైన పొగమంచులో.. ఏమీ కనిపించని స్థితిలో తన కొడుకు ప్రాణభయంతో వేస్తున్న కేకలు ఆయనకు వినిపించాయి. ‘అతడు అరుస్తూనే ఉన్నాడు.. సేవ్‌ మీ పాపా..’ అంటూ పిలుస్తూనే ఉన్నాడు’ అని రాజ్‌ గుర్తు చేసుకున్నారు. దాదాపు గంటపాటు అతడి కేకలు విన్నాను.. ప్రతిసారి అతడి గొంతు క్రమంగా డస్సిపోయింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో చిమ్మచీకటిలో యువరాజ్‌ తన సెల్‌ఫోన్‌ టార్చ్‌ వెలిగించి.. కేకలు వేయడం కనిపించింది. సహాయ బృందాలు అతడిని చేరుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుండటమూ ఉంది. ఒక దశలో ఒక వ్యక్తి సాహసించి, లోతైన, వెడల్పుగా ఉన్న గోతిలోని నీటిలోకి దూకాడు. గడ్డకట్టించే చలిలో దాదాపు 30 నిమిషాలు పాటు వెతికాడు. కానీ ప్రయోజనం దక్కలేదు. ఒక దశలో యువరాజ్‌ టార్చ్‌ ఆగిపోయింది. మళ్లీ కొన్ని క్షణాల తర్వాత వెలిగింది. అదే ఆఖరు. ఇక టార్చ్‌ కనిపించలేదు.

సహాయ బృందాలు చేరుకున్నప్పటికీ.. వారి వద్ద సరైన ఎక్విప్‌మెంట్‌ లేకపోవడంతో సహాయ చర్యలు బాగా ఆలస్యమైనట్టు తెలుస్తున్నది. పైగా.. ఆ గోతిలోని నీటిలో పెద్ద సంఖ్యలో ఇనుపరాడ్లు నిర్లక్ష్యంగా పడేశారు. దీంతో సాహసించి దూకేందుకు కూడా వీలు లేకుండా పోయిందని పోలీసు అధికారులు తెలిపారు. తెల్లవారుజాము సుమారు 1.30 నుంచి 1.40 మధ్యలో యువరాజ్‌ గొంతు మూగబోయింది. ఈ గోతిని సుమారు రెండేళ్లుగా అలానే ఉంచేశారని స్థానికులు చెబుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రెండు నిర్మాణ సంస్థలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

సంస్థాగత వైఫల్యాలే నా కుమారుడి ప్రాణాలు తీశాయి..

తన కుమారుడు ప్రమాదంలో చనిపోలేదని, వ్యవస్థాగత లోపాలే తన కొడుకు ప్రాణాలు తీశాయని యువరాజ్‌ తండ్రి రాజ్‌కుమార్‌ మెహతా ఆరోపించారు. సహాయం తగిన సమయంలో అందకపోవడం వల్లే అతడు ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అతడి కేకలు నాకు వినిపించాయి. అక్కడ వంద మంది ఉన్నారు.. కానీ.. ఒక్కడి ప్రాణాలు కాపాడలేకపోయారు’ అంటూ ఆయన కన్నీరుమున్నీరయ్యారు.

Latest News