Snake Bite | ఒక్కసారి పాము కాటేస్తేనే( Snake Bite )మనషులు విలవిలలాడిపోతారు.. చివరకు ప్రాణాలు కోల్పోతారు. కానీ ఈ బాలిక 40 రోజుల వ్యవధిలో 9 సార్లు పాము కాటుకు గురైంది. అయినా ప్రాణాలతో బతికి బయటపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) కౌశంబి జిల్లాలో వెలుగు చూసింది.
కౌశంబి జిల్లాలోని భాయిన్సహపర్ గ్రామానికి చెందిన 15 ఏండ్ల బాలిక 9వ తరగతి చదువుతుంది. అయితే ఆమె తొలిసారిగా జులై 22న పాము కాటుకు గురైనట్లు తండ్రి రాజేంద్ర మౌర్య తెలిపాడు. ఆ సమయంలో హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడింది. మళ్లీ ఆగస్టు 13వ తేదీన మరోసారి బాలికను పాము కాటేసింది. ఈ సారి బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. ప్రయాగ్‌రాజ్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడికి తీసుకెళ్లే సమయం లేక స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు ఆస్పత్రిలోనే చికిత్స ఇప్పించి, ఆమెను ప్రాణాలతో కాపాడుకోగలిగారు.
బాలిక ఆరోగ్యం కోలుకుంటుందన్న సమయంలోనే మరోసారి పాము ఆమెపై పగబట్టింది. ఆగస్టు 27 నుంచి 30వ తేదీ మధ్యలో ఏడు సార్లు పాము కాటుకు గురైంది. స్నానం చేస్తున్న సమయంలో, ఇంటి పనుల్లో ఉన్న సమయంలో పాము కాటేసినట్లు బాధిత బాలిక తెలిపింది. అయితే బాలికను ఆస్పత్రికి తరలించే స్థోమత లేక.. ఓ తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లారు. ఆమె మళ్లీ కుదుటపడ్డారు.
పాము కాటుపై బాలిక కుటుంబ సభ్యులు అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. తమ ఇంటి పరిసరాల్లో సంచరిస్తున్న పామును పట్టుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. కానీ అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఈ విషయం కౌశంబి చీఫ్ మెడికల్ ఆఫీసర్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఆరోగ్య శాఖ అధికారులను గ్రామానికి పంపించారు. ఆ గ్రామంలోని పరిస్థితిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.