Shashi Tharoor | తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఎగిరిపోవడానికి సిద్ధపడుతున్నారా? తాజాగా ఎఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు, అందుకు ప్రతిగా శశిథరూర్ ఇచ్చిన ప్రకటన ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచదేశాలకు వెళ్లి ప్రచారం చేసివచ్చే బృందానికి శశిథరూర్‌ను ఎంపిక చేసినప్పటి నుంచి వివాదం రగులుతున్నది. శశిథరూర్ విదేశాలకు వెళ్లివచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి ఒక గొప్ప బలం అని పొగిడారు. ఆయన శక్తిసామర్థ్యాలు, క్రియాశీలత, సానుకూల దృక్పథం దేశానికి ఒక గొప్ప బలం అని శశిథరూర్ అన్నారు.
బుధవారం పాత్రికేయులు శశిథరూర్ వ్యాఖ్యలను ఖర్గే దృష్టికి తీసుకు రాగా ‘మాకు దేశం ప్రథమం. కొందరికేమో మోదీ ప్రథమం, తర్వాతనే దేశం. ఏమి చేస్తాం?’ అని సమాధానమిచ్చారు. దీనికి థరూర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక విసురు విసిరారు. ‘ఎగరడానికి ఎవరి అనుమతి అడగవద్దు. రెక్కలు నీవి. ఆకాశం ఎవరిదీ కాదు’ అని థరూర్ అందులో వ్యాఖ్యానించారు. రచయిత కూడా అయిన థరూర్ నర్మగర్భంగా స్పందించారు. ఆయన నరేంద్ర మోదీ బాటలో ప్రయాణించడానికి సిద్ధపడుతున్నారన్న ప్రచారాలు ఊపందుకున్నాయి.