Tihar jail | తీహార్ జైలు గురించి అది ఉన్న ఢిల్లీ వాసులకే కాదు.. మొత్తం దేశానికి బాగానే పరిచయం. అనేక మంది రాజకీయ నాయకులు ఇక్కడే నిర్బంధానికి గురయ్యారు. కరడుగట్టిన నేరస్థులకు ఇది నెలవు. మొన్నామధ్య బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుల సందర్భంగా తీహార్ జైలు వార్తల్లోకి ఎక్కింది. సుదీర్ఘ చారిత్రక నేపథ్యం ఉన్న ఈ జైలు.. దక్షిణాసియాలోనే అతిపెద్ద జైలు కాంప్లెక్సుల్లో ఒకటిగా చెబుతారు. దీనిని ఇప్పుడు తరలించబోతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా 2025..26 సంవత్సరానికి గాను సమర్పించిన బడ్జెట్‌లో జైలు కాంప్లెక్స్ తరలింపు, ఇతర ఖర్చుల కోసం సుమారు పదికోట్ల రూపాయలను కేటాయించారు. కరడుగట్టిన నేరస్తులను ఉంచే ఈ జైలు ఢిల్లీ శివారు ప్రాంతంలో ఉన్నది. ఇప్పటికే తీహార్ జైలు గరిష్ఠస్థాయిలో నిండిపోయింది. దీనిపై ఒత్తిడి తగ్గించేందుకు, ఖైదీల సంక్షేమం కోసం కొత్త జైలు కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని ఆమె తెలిపారు. దీనిని వేరే ప్రాంతానికి తరలిస్తామని పేర్కొన్నారు. కొత్త జైలు అభివృద్ధికి ఒక స్కీమ్‌ను ఆమె ప్రకటించారు.
తీహార్ జైలు 1958లో ప్రారంభమైంది. పశ్చిమ ఢిల్లీ ప్రాంతంలో ఉన్నప్పటికీ దీనిని పంజాబ్ రాష్ట్రం తొలుత నిర్వహించింది. 1966లో దానిని ఢిల్లీ నియంత్రణలోకి తెచ్చారు. ఈ జైల్లో ఖైదీల సంఖ్య పెరిగిపోవడంతో ఖైదీలను చిన్నచిన్న సెల్స్‌లో ఉంచుతూ వస్తున్నారు. దీంతో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ కాంప్లెక్స్ మొత్తం 400 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. 10,026 మంది ఖైదీలను ఉంచేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. కానీ.. ప్రస్తుతం ఈ జైల్లో 19,500 ఉంటున్నారంటే ఎంత ఇరుకుగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. బప్రోలాలో సైతం తాము స్థలాన్ని కోరామని, కానీ అక్కడి ఆక్రమణ నేపథ్యంలో వీలు కాలేదని తీహార్ జైలు అధికారి ఒకరు చెప్పినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. దీంతో వేరొక చోట వంద ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఢిల్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని ఆయన పేర్కొన్నారు. ఒకటి నుంచి 9వ నంబర్ జైళ్లను 5వేల మందిని ఖైదు చేసేందుకు ఉద్దేశించినప్పటికీ.. ప్రస్తుతం ఈ జైళ్లలో 12వేల మందికిపైగా ఉన్నారని ఆయన వివరించారు. ఇక జైలు నంబర్ 10 నుంచి 16 వరకు 3,700 మందిని ఉంచేందుకు ఏర్పాటు చేయగా.. అక్కడ 3900 మందిని ఉంచామని తెలిపారు. తీహార్‌లోని 4వ నంబర్ జైలు మండోలి జైళ్లను ములాయిజా జైళ్లు అని పిలుస్తారు. అంటే.. ఇక్కడ మొదటిసారి నేరం చేసి జైలుకు వచ్చినవారిని ఉంచుతారన్నమాట. ఈ రెండు జైళ్లలో కూడా పెద్ద సంఖ్యలో ఖైదీలు ఉన్నారని జైలు వర్గాలు చెబుతున్నాయి.