Site icon vidhaatha

ఇంటరాగేషన్‌ ఒక్కటే అరెస్టుకు ప్రాతిపదిక కాదు: కేజ్రీవాల్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : అరెస్టుకు ఇంటరాగేషన్‌ ఒక్కటే ప్రాతిపదిక కాబోదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీకి సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘కేవలం విచారణ పేరుతో మిమ్మల్ని అరెస్టు చేయడం తగదని మేం భావిస్తున్నాం. సెక్షన్‌ 19 కూడా అందుకు అనుమతించడం లేదు’ అని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగాలా, రాజీనామా చేయాలా అన్నది కేజ్రీవాల్‌ నిర్ణయించుకోవాల్సిన అంశమని, ఎన్నికైన ఒక నాయకుడిని పదవి నుంచి దిగిపోవాలని కోర్టు కోరవచ్చా? లేదా? అన్న విషయంలో తమకు సందేహాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. కేజ్రీవాల్‌ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడని, ఆయన సుమారు 90 రోజులపాటు నిర్బంధాన్ని అనుభవించారని పేర్కొన్నది. ఈడీ కేసులో ఆయన అరెస్టుకు ఉన్న చట్టబద్ధతపై ప్రశ్నలను విస్తృత ధర్మాసనానికి కోర్టు నివేదించింది. ఈ అంశం జీవించి ఉండే హక్కుకు సంబంధించిన అంశమని, అందుకే ఆయన అరెస్టు అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదిస్తున్నామని పేర్కొటూ ఆయనను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. మే 10న జారీ చేసిన నిబంధన ప్రకారం ఆయన విడుదల ఉంటుందని తెలిపింది. సీఎంవోను, సచివాలయాన్ని సందర్శించకూడదని గత మధ్యంతర బెయిల్‌ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. పాలనాపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదం లేనిదే ఎలాటి ఫైళ్లపైనా సంతకాలు చేయకూడదని స్పష్టం చేసింది. ఈడీ కేసులో ట్రయల్‌ కోర్టు కేజ్రీవాల్‌కు గత నెలలో బెయిల్‌ ఇచ్చినా.. దర్యాప్తు సంస్థ వెంటనే హైకోర్టును ఆశ్రయించి, స్టే తెప్పించింది. అనంతరం ఆయనను సీబీఐ అరెస్టు చేసింది.

Exit mobile version