దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకున్న బీజేపీ

దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకుని బీజేపీ లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటోందని ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ మంత్రి ఆతిశి విమర్శించారు.

  • Publish Date - April 8, 2024 / 12:18 PM IST

వాటి మాటున దాగి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ
ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి
మీరు చేసిన పని ప్రాతిపదికన పోటీ చేయండి
బీజేపీకి ఢిల్లీ మంత్రి ఆతిశి సవాల్‌
లిక్కర్‌ స్కాం డబ్బు జాడలు బీజేపీలోనే
నోటీసులిచ్చి నడ్డాను అరెస్టు చేయాలని డిమాండ్‌

న్యూఢిల్లీ : దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకుని బీజేపీ లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటోందని ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ మంత్రి ఆతిశి విమర్శించారు. అధికార పార్టీకి దమ్ముంటే బీజేపీ తాను చేసిన పనిని చెప్పుకొని ఆప్‌పై తలపడాలని సవాలు విసిరారు. శనివారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆప్‌ మీద ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ మీద బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీ, ఎన్నికల సంఘం ద్వారా అన్ని రకాల తప్పుడు కేసులు పెట్టించింది. గోవాలో పెట్టని కేసు కూడా ఇలాంటిదేనని అన్నారు.

బీజేపీ ఫిర్యాదుతో ఈసీ అరవింద్‌ కేజ్రీవాల్‌కు నోటీసులు పంపిందని విమర్శించారు. కానీ.. ఆధారాల్లేవంటూ గోవా కోర్టు కేసును శుక్రవారం కొట్టివేసిందని చెప్పారు. ‘ఆప్‌ను రాజకీయంగా ఎదుర్కొనాలంటే బీజేపీ దర్యాప్తు సంస్థల మాటున దాగి ఉండొద్దు. మీకు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి మీ పని ఆధారంగా ఎన్నికలను ఎదుర్కొనండి’ అని చెప్పారు. డబ్బు జాడలపై ఆధారాలు లేకున్నా ఆప్‌ నాయకులను అరెస్టు చేశారని ఆతిశి విమర్శించారు. అదే సమయంలో డబ్బు జాడలు తేలినప్పటికీ బీజేపీపై లేదా ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

‘2024, మార్చి 21న తొలిసారి లిక్కర్‌ స్కామ్‌ డబ్బు జాడలు వెలుగులోకి వచ్చాయి. డబ్బు జాడలు ఉండొచ్చన్న అనుమానంతో అనేక సోదాలు, అనేక అరెస్టులు చేశారని, కానీ.. ఆధారాలు బయటకు వచ్చిన పదహారు రోజుల్లో ఈడీ ఎన్ని సోదాలు? ఎన్ని అరెస్టులు నిర్వహించింది? లిక్కర్‌ వ్యాపారి శరత్‌రెడ్డి నుంచి బీజేపీ ఖాతాలోకి డబ్బులు వెళ్లినట్టు కనిపిస్తున్నా ఈడీ చేసింది శూన్యం’ అని ఆమె చెప్పారు. సౌత్‌ గ్రూప్‌ నుంచి 55 కోట్లు బీజేపీకి వెళ్లిన నేపథ్యంలో ఈడీ ఎప్పుడు విచారణ జరుపుతుందని ప్రశ్నించారు.

‘నేను ఈడీని అడుగుతున్నా.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమన్లు ఎప్పుడు జారీ చేస్తున్నారు? ఆయన నివాసాల్లో ఈడీ ఎప్పుడు సోదాలు నిర్వహిస్తుంది? ఆయనను ఎప్పుడు అరెస్టు చేస్తారు?’ అని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆప్‌ నేతలను, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని ఆరోపించారు. డబ్బు జాడలను ఏ ఒక్క ఆప్‌ నేత వద్ద ఈడీ కనుగొనజాలదని స్పష్టం చేశారు.

Latest News