Discontent Modi : దశాబ్దంపాటు ఎదురులేని మొనగాడిలా ప్రపంచం ముందు తిరిగిన ప్రధాని మోదీకి మూడో విడుత పాలనలో వాతావరణం అంత సానుకూలంగా ఉన్నట్టు కనిపించడం లేదు. పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాలు మొదలుకుని.. దేశంలో దిగజారుతున్న పారిశ్రామిక వృద్ధి వరకూ.. ఐదు అంశాల్లో మోదీ పాలన వైఫల్యాలు, అసంతృప్త వాతావరణం కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
సైనిక సాహసం అనంతర చేదు ఫలితం
ఆపరేషన్ సిందూర్ సమయంలో యావత్ దేశం ఊగిపోయింది. ఆక్రమిత కశ్మీర్‌తోపాటు, పాకిస్తాన్ భూభాగంపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే సెభాష్ అంది. అయితే.. ఆ నాలుగు రోజుల ఘర్షణలో ఏం జరిగిందనేది ఇంకా స్పష్టంగా ఎవరూ చెప్పలేదు. ఉగ్రమూకలను అంతమొందించామని చెప్పినా.. భారత్‌కు ఏమైనా నష్టం వాటిల్లిందా? అన్నవి ప్రజలకూ చెప్పలేదు.. పార్లమెంటుకూ చెప్పలేదు. మొట్టమొదటిసారిగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ప్రాథమికంగా కొన్ని నష్టాలు సంభవించాయని అంగీకరించారు. అదికూడా విదేశీ గడ్డపై మాట్లాడుతూ. ఆ తర్వాత జట్ విమానాలను కోల్పోయామని అంగీకరించారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న అంశాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రతిపక్ష పార్టీల సభ్యులను కలుపుకొని బృందాలను వివిధ దేశాలకు పంపారు. కానీ.. దానికి అంత సానుకూల స్పందన వచ్చినట్టు కనిపించలేదు. పైగా.. పుండు మీద కారం చల్లినట్టు.. భారత దళాలు ధ్వంసం చేసిన ఉగ్రవాద శిబిరాలను పునర్నిర్మిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
కీలక అంశాల్లో పాకిస్తాన్ చర్యలు
ఒకవైపు పొరుగుదేశంతో భీకర కాల్పులు జరుగుతున్న సమయంలోనే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి పాకిస్తాణ్ భారీ రుణాన్ని తెచ్చేసుకున్నది. 1958 తర్వాత పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ నుంచి లభించిన 24వ రుణం ఇది. ఐఎంఎఫ్ బోర్డ్‌లో 25 దేశాల సభ్యులు ఉన్నారు. మన దేశ ఓటింగ్ విలువ కేవలం 2.6 శాతం. ఓటింగ్ బదులు ఏకాభిప్రాయానికే అవకాశం ఇచ్చే ఐఎంఎఫ్.. ఒకవైపు పాకిస్తాన్‌కు భారీ రుణం ఇస్తుంటే.. భారత్ మౌన ముద్ర దాల్చి.. బాయ్‌కాట్ చేయడం మినహా ఏమీ చేయలేక పోయింది. జూలై నెలకు గాను పాకిస్తాన్.. ఐక్య రాజ్య సమితి భాద్రతా మండలి నాన్ పర్మినెంట్ మెంబర్‌గా అధ్యక్ష పదవిని చేపట్టనున్నది. భద్రతా మండలికి చెందిన తాలిబన్ ఆంక్షల కమిటీకి అధ్యక్ష పదవికి ఎంపికైంది. అంతేకాదు.. 15 సభ్యదేశాలు ఉన్న ఉగ్రవాద వ్యతిరేక కమిటీకి వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నది. అంతేకాదు.. భారతదేశపు దీర్ఘకాలిక మిత్రదేశమైన రష్యా నుంచి.. సోవియట్ కాలం నాటి పాత స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నది.
భారత మద్దతు గతంలో సార్క్ అనే సంస్థ పనిచేసేది. దక్షిణ ఆసియా సహకార సంఘం. ఇప్పుడు అది పనిచేయడం లేదు. దానిని చైనా మద్దతుతో పునరుద్ధరించే పనిలో పాకిస్తాన్ ఉన్నది. ఈ విషయంలో ఇప్పటికే చైనాలోని కున్మింగ్‌లో నిర్వహించిన సమావేశంలో చర్చలు కూడా సాగాయి. ఈ సమావేశంలో భారతదేశ మాజీ మిత్ర దేశం బంగ్లాదేశ్ కూడా పాల్గొన్నది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పాకిస్తాన్ ప్రపంచ స్థాయిలో గౌరవ మర్యాదలు పొందుతున్నది.
పాకిస్తాన్ జనరల్‌కు ఎక్కడలేని మర్యాదలు
అనేక ఏళ్లపాటు ఇప్పటి పాకిస్తాన్ సైనిక జనరల్ అసిమ్ మునీర్ బయటకు పెద్దగా కనిపించేవాడు కాదు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వింగ్ ఐఎస్‌ఐ చీఫ్‌గా పనిచేసిన ఆయన తర్వాత ఆర్మీ చీఫ్ అయ్యారు. ఇండియా, పాకిస్తాన్ ఘర్షణ తర్వాత ఆయనకు ఎక్కడ లేని హోదా వచ్చేసింది. ఏకంగా వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి విందుకు హాజరయ్యేంత పలుకుబడి వచ్చింది. జనరల్ పర్వేజ్ ముషరఫ్ 2001లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్‌ను కలిసిన తర్వాత.. 24 ఏళ్లుగా ఏ పాకిస్తానీ జనరల్ కూడా వైట్‌హౌస్‌లో అడగు పెట్టలేదు. నిజానికి ముషరఫ్ కూడా నాటి పాకిస్తాన్ అధ్యక్షుడి హోదాలోనే వెళ్లారు. ప్రపంచ రాజకీయాల్లో పాకిస్తాన్ తన జోక్యాన్ని పెంచుకుంటున్న క్రమంలోనే మునీర్ సైతం అమెరికా ఆతిథ్యం పొందారు. ఇది భారత ప్రభుత్వానికి రుచించేది కాదు.
షాంఘైలో అవమానం
షాంఘైలో ఇటీవల షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశం నిర్వహించారు. అందులో సభ్య దేశాల రక్షణ మంత్రులు ఆ సమావేశానికి హాజరయ్యారు. అయితే.. ఆ సమావేశం ముసాయిదాపై సంతకం చేసేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తిరస్కరించారు. ఆ ముసాయిదాలో అత్యంత భయానకమైన పహల్గామ్ దాడిని ప్రస్తావించలేదు కానీ.. మార్చి నెలలో బలూచిస్తాన్‌లో రైలుపై దాడి ఘటనను ప్రస్తావించారు.
తొమ్మిది నెలల కనిష్ఠానికి పారిశ్రామిక వృద్ధి
నెల రోజుల క్రితం నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణియన్ ఒక ప్రకటన చేస్తూ జపాన్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని గొప్పగా ప్రకటించారు. అక్కడితో ఆగలేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి జర్మనీని కూడా దాటేస్తామని చెప్పారు. తీరా చూస్తే.. భారతదేశపు పారిశ్రామిక ఉత్పత్తి సోమవారం (30 జూన్ 2025) నాటి లెక్కల ప్రకారం 1.2 శాతంగా నమోదైంది. అంటే.. అది తొమ్మిది నెలల కనిష్ఠం. మైనింగ్, పవర్ సెక్టర్‌లలో సంకోచాలు ఇందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. కనిష్ఠ పారిశ్రామికోత్పత్తి ద్వారా గ్రామీణ వినియోగం బలహీనపడితే.. ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్)తోపాటు.. చిన్న తరహా పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. పారిశ్రామికవేత్తలతో ఆంతరంగికంగా మాట్లాడితే.. దేశ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి..
NYC Mayor mamdani | న్యూయార్క్ కాబోయే మేయర్ మామ్దానీపై ఇండియాలో భిన్నం స్పందనలెందుకని?
Desert Whale| అశ్చర్యం…ఎడారిలో తిమింగలం!
సౌందర్య తపనే శత్రువైందా? షెఫాలీ మృతిపై వైద్యుల అనుమానం
Mushroom Farming | పుట్టగొడుగుల సాగు.. ఏడాదికి రూ. 18 లక్షలు సంపాదిస్తున్న స్కూల్ పిల్లాడు..