Site icon vidhaatha

Indo Pak War to Operation Sindoor | ఇండో – పాక్ వార్ టు ఆప‌రేష‌న్ సిందూర్.. భార‌త్ – పాక్ మ‌ధ్య యుద్దాలు, దాడులు ఇవే..

Indo Pak War to Operation Sindoor | ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి( Pahalgam terror attack ) త‌ర్వాత భార‌త్( India ) – పాకిస్తాన్( Pakistan ) మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. పాకిస్తాన్ ప‌దేప‌దే కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. భార‌త సైన్యానికి( Indian Army ) చెందిన చెక్‌పోస్టుల‌పై కాల్పులు జ‌రుపుతూ.. స‌రిహ‌ద్దు గ్రామాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేసిన ప‌రిస్థితి. ఈ ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా కేంద్ర ప్ర‌భుత్వం.. ఆప‌రేష‌న్ సిందూర్‌( Operation Sindoor )కు శ్రీకారం చుట్టింది. ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి జ‌రిగిన రెండు వారాల‌కు అంటే మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి 1.44 గంట‌ల‌కు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌( POK )లోని మొత్తం 9 ఉగ్ర‌వాదుల శిబిరాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని భార‌త సైన్యం మిస్సైళ్ల‌తో దాడులు చేసింది. ల‌ష్క‌రే తోయిబా( Lashkar-e-Taiba ), జైషే మ‌హ‌మ్మ‌ద్( Jaish-e-Mohammad) ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను నేల‌మ‌ట్టం చేసి 80 మందికి పైగా ఉగ్ర‌వాదుల‌ను( Terrorists ) మ‌ట్టుబెట్టింది. అయితే స్వాత్రంత్య్రం అనంత‌రం దాయాది దేశం పాకిస్తాన్‌తో భార‌త్‌కు జ‌రిగిన యుద్ధాలు ఎన్ని..? ప్ర‌త్యేక దాడులు ఎన్ని అనే అంశాల‌ను స‌వివ‌రంగా తెలుసుకుందాం..

భార‌త్ – పాక్ మ‌ధ్య జ‌రిగిన ముఖ్య‌మైన యుద్ధాలు, దాడులు ఇవే..

మూడు యుద్ధాలు (1947, 1965, 1971)
కార్గిల్ యుద్ధం (1999)
మూడు ప్ర‌త్యేక దాడులు ( 2016, 2019, 2025)

ఇండో – పాక్ యుద్ధం (1947) ( First Indo – Pak War )

ఇది భారతదేశ‌ విభజన అనంతరం తలెత్తిన మొదటి ప్రధాన యుద్ధం ఇండో – పాక్ యుద్ధం. జమ్ముకశ్మీర్ రాజ్యం భారత్‌లో విలీనమవుతున్నట్లు ప్రకటన చేసిన తర్వాత, పాకిస్తాన్ మద్దతుతో గిరిజన దళాలు క‌శ్మీర్‌లోకి చొరబడ్డాయి. భారత సైన్యం గిరిజన దళాలను వెనక్కి తరిమి కొట్టింది. చివరికి ఐక్యరాజ్యసమితి జోక్యంతో కాల్పుల విరమణ జరిగింది. అయితే కాశ్మీర్ మూడవ వంతు భాగం పాక్ ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఇదే ప్రస్తుతం పాక్ ఆక్రమిత క‌శ్మీర్‌గా పిలుస్తున్నారు. ఈ యుద్ధాన్ని క‌శ్మీర్ యుద్ధం అని కూడా పిలుపుస్తారు.

ఇండో – పాక్ యుద్ధం (1965) ( Second Indo – Pak War )

పాకిస్తాన్ ఆపరేషన్ జిబ్రాల్టర్ అనే ఆపరేషన్‌తో తిరుగుబాటుదారులను పంపి, క‌శ్మీర్‌లో అంతరాయం కలిగించాలనుకుంది. భారత సైన్యం దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్ పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి కీలక ప్రాంతాలను ఆక్రమించింది. తర్వాత తాష్కెంట్ ఒప్పందం ద్వారా భూభాగాలను పరస్పరం తిరిగి ఇచ్చుకున్నారు. ఈ యుద్ధంలోనూ భారత్ కచ్చితంగా పైచేయి సాధించింది. దీన్ని రెండో క‌శ్మీర్ యుద్ధంగా పిలుస్తారు.

బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం(1971) ( Bangladesh Liberation War )

తూర్పు పాకిస్తాన్ ప్రజలు (ప్రస్తుతం బంగ్లాదేశ్) స్వాతంత్య్రాన్ని కోరుతూ ఉద్యమించగా, పాకిస్తాన్ సైన్యం దాన్ని అణిచివేయటానికి దాడులు చేసింది. భారత్ బంగ్లాదేశ్‌కు మద్దతు ఇచ్చి యుద్ధంలో పాల్గొంది. అతి తక్కువ కాలంలో తూర్పు పాకిస్తాన్‌ను భారత్ పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. 93వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. దీంతో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది. భారత్‌కు ఇది గర్వకారణంగా నిలిచింది.

కార్గిల్ యుద్ధం (1999)( Kargil War )

పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదులు కలిసి కార్గిల్‌లోని ఎత్తైన ప్రాంతాల్లోకి చొరబడటంతో కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. భారత్ ఆపరేషన్ విజయ్ పేరుతో పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో భారత్ తన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ అంతర్జాతీయ ఒత్తిడికి లోనై వెనక్కి తగ్గింది. ఈ యుద్ధంలోనూ 1999 జులై 26న భారత్ విజయతీరానికి చేరింది. ఇక ప్ర‌తి ఏడాది జులై 26వ తేదీన కార్గిల్ విజ‌య్ దివాస్‌గా జ‌రుపుకుంటున్నారు.

యురి సర్జికల్‌ స్ట్రైక్స్‌(2016) ( Uri Attack and Surgical Strikes )

2016 సెప్టెంబ‌ర్ నెల‌లో జమ్ముకశ్మీర్‌ యురిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేశారు. యురి దాడిలో 19 మంది భారత జవాన్లు మృతి చెందారు. దాదాపు 30 మందికి పైగా గాయాలయ్యాయి. పాక్ ప్రేరిత జైషే మ‌హమ్మద్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం 10 రోజుల తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేపట్టి పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను బూడిద చేసింది. భీంబర్, కెల్, తట్టపాణి, లిపా ప్రాంతాల్లోని అనేక ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌లను నేలమట్టం చేశారు. ఉదయాన్నే ఆపరేషన్ పూర్తి చేసిన తర్వాత భారత సైన్యం తిరిగి వచ్చింది. ఈ దాడిలో 38 మంది ఉగ్రవాదులు మరణించినట్లు భారత సైన్యం అప్పట్లో ప్రకటించింది.

బాలాకోట్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌(2019) ( Pulawama Attack and Balakot Strikes )

2019 ఫిబ్రవరి 14 న పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు వెళ్తున్న కాన్వాయిని తీవ్రవాదులు పేల్చేశారు. ఈ పేలుడులో 40 మంది జవాన్లు అమరులయ్యారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. సరిగ్గా 12 రోజులకు.. అంటే 2019 ఫిబ్రవరి 26న, భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్-2000 విమానం రాత్రి వేళ నియంత్రణ రేఖను దాటి పాకిస్థాన్‌ వైపున ఉన్న బాలాకోట్‌లోని జైషే మహ్మద్ శిక్షణా శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఈ సర్జికల్‌ స్ట్రైక్‌లో చాలా మంది ఉగ్ర‌వాదులు చ‌నిపోయారు. మరుసటి రోజు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం పాకిస్థాన్‌ చేసింది. పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 కూల్చివేసింది. పాకిస్థాన్ కూడా మన మిగ్-21 విమానాన్ని కూల్చివేసి, వింగ్ కమాండర్ అభినందన్‌ను అరెస్టు చేసింది. అయితే మూడు వైపుల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గిన పాకిస్థాన్‌ ప్రభుత్వం రెండు రోజుల తర్వాత అభినందన్‌ను క్షేమంగా భారత్‌కు అప్పగించారు.

ఆపరేషన్‌ సిందూర్‌(2025) ( Operation Sindoor )

ఈ ఏడాది ఏప్రిల్ 22న ప‌హ‌ల్గాంలోని బైస‌ర‌న్‌లో ప‌చ్చిక బ‌య‌ళ్ల‌లో సేద‌తీరుతున్న ప‌ర్యాటకుల‌పై ఉగ్ర‌వాదులు విచక్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపి 26 మందిని చంపేశారు. ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో.. పాక్, పాక్ ఆక్రమిత క‌శ్మీర్‌లోని 9 ఉగ్రస్థావ‌రాలే లక్ష్యంగా భారత్‌ విరుచుకుపడింది. ఈ ప్రతీకార దాడిలో దాదాపు 80 మందికిపైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ స్ట్రైక్స్‌కు ఆపరేషన్‌ సిందూర్‌ పెట్టడానికి బలమైన కారణమే ఉంది. ప‌హ‌ల్గాం ఉగ్రదాడిలో భ‌ర్తల‌ను కోల్పోయిన మ‌హిళ‌ల ప్రతీకారానికి చిహ్నంగా ఈ పేరు పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ పేరును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సూచించినట్లు సమాచారం. యోధుల‌కు పెట్టే వీర‌తిల‌కం అనే అర్థం కూడా దీనిలో ఉంద‌ని చెబుతున్నారు.

Exit mobile version