Site icon vidhaatha

2024 కేంద్ర బడ్జెట్‌లో చారిత్రక నిర్ణయాలు: ఉభయసభలనుద్దేశించి ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ దీర్ఘకాలిక విధానాలు, భవిష్యత్తుకు సమర్థమైన పత్రంగా కేంద్ర బడ్జెట్‌ ఉండబోతున్నదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. గురువారం పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. కొత్త ప్రభుత్వ తొలి బడ్జెట్‌లో భారీ ఆర్థిక, సామాజిక నిర్ణయాలతోపాటు.. చారిత్రక చర్యలు ఉండబోతున్నాయని ద్రౌపది ముర్ము ప్రకటించారు. ప్రభుత్వం అనుసరించిన సంస్కరణల కారణంగా గత పదేళ్లలో భారతదేశం 11వ స్థానం నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చెప్పారు. ‘భారతదేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా నా ప్రభుత్వం కృషి చేస్తున్నది’ అని తెలిపారు.

లోక్‌సభ ఎన్నికలను సజావుగా నిర్వహించిన ఎన్నికల సంఘాన్ని రాష్ట్రపతి అభినందించారు. ‘ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నిక. జమ్ముకశ్మీర్‌లో దశాబ్దాల నాటి ఓటింగ్‌ రికార్డులు బద్దలయ్యాయి. గత నాలుగు దశాబ్దాలుగా బంద్‌లు, సమ్మెలతో కశ్మీర్‌లో చాలా స్వల్పంగా ఓటింగ్‌ జరిగేది. ఇది కశ్మీర్‌ ప్రజల అభిప్రాయంగా అంతర్జాతీయ వేదికల్లో భారతదేశ శతృవులు ప్రచారం చేసేవారు. కానీ.. ఈసారి అటువంటి శక్తులకు కశ్మీర్‌ లోయ తిరుగులేని సమాధానం చెప్పింది’ అని ముర్ము అన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు మూడోసారి విశ్వాసం ఉంచడంతో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిందని ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రజల ఆకాంక్షలను ఈ ప్రభుత్వం నెరవేర్చుతుందని ప్రజలకు తెలుసని అన్నారు.

Exit mobile version