Site icon vidhaatha

దేశంలో అమ్ముడుపోని కార్ల విలువ తెలిస్తే గుండె గుభేలే!

ముంబై: కార్ల పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంటున్నదా? దేశంలో అమ్ముడుపోకుండా డీలర్ల వద్దే లక్షల సంఖ్యలో కార్లు పడి ఉండటం గమనిస్తే అవునే అంటున్నారు ఆటోమొబైల్‌ నిపుణులు. కార్లు, ఎస్‌యూవీల అమ్మకాలు గణనీయంగా మందగించాయి. డీలర్ల వద్ద అమ్ముడుపోకుండా పడి ఉన్న కార్ల విలువ 60వేల కోట్ల రూపాయల పైమాటేనని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అమ్మకానికి కార్లు సిద్ధంగా ఉన్నా, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఇస్తున్నా.. 62 రోజుల నుంచి 67 రోజుల ఆల్‌టైం హై ఇన్వెంటరీని ప్యాసింజర్‌ వెహికల్స్‌ ఎదుర్కొంటున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత వాహనాల అమ్మకాలు పుంజుకుంటాయని తొలుత భావించారు. దానికి ఆశాజనక రుతుపవన సీజన్‌ కూడా తోడైంది. అయినా కూడా వారాల తరబడి వాహనాలు డీలర్ల వద్దే ఉంటున్నాయి. వర్షాకాలంలో వాహనాల అమ్మకాలు తగ్గడం కూడా కార్లు పోగుపడిపోవడానికి ఒక కారణంగా అంచనా వేస్తున్నారు. అమ్ముడుపోని కార్లు మార్కెట్‌లో ఆరు లక్షల నుంచి ఆరున్నర లక్షల వరకూ ఉంటాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఏడీఏ) అధ్యక్షుడు మనీశ్‌ రాజ్‌ సింఘానియా చెప్పారు. ఒక్కోటీ సగటున 9.5 లక్షల రూపాయలు అనుకున్నా.. గత రెండు నెలల్లో 77వేల కోట్ల విలువైన కార్లు పేరుకుపోయాయని తెలిపారు.
జూన్‌ నెలలో మొత్తం హోల్‌సేల్‌ డిస్పాచెస్‌ 3,41,000 యూనిట్లు ఉన్నాయి. అంటే.. 4 శాతం ఎక్కువ. కానీ.. వాస్తవంగా అమ్మకాలు (వాహన రిజిస్ట్రేషన్లు) 2,81,600 యూనిట్లే. ఉత్పత్తికి, మార్కెట్‌ డిమాండ్‌కు మధ్య ఉన్న వ్యత్యాసం ఏ స్థాయిలో ఉన్నదో ఈ లెక్కలు చెబుతున్నాయి.
‘బ్యాంకులు రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధంగా లేవు. మంచి సిబిల్‌ స్కోర్‌ ఉన్నవారికే వాహన రుణాలు మంజూరు చేస్తున్నాయి. దీని వల్ల కూడా డిమాండ్‌ ఉండటం లేదు. అందుకే డిస్కౌంట్‌లు భారీగా ఇస్తున్నారు’ అని ముంబైకి చెందిన ఒక కారు డీలర్‌ తెలిపారు. గతంలో లేనంతగా డిస్కౌంట్లు ఇటీవల పెరిగాయి. కొత్త మోడళ్లపైనా డిస్కౌంట్లు లభిస్తున్నాయంటే కార్ల డీలర్లు ఎంత ఒత్తిడితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని పలువురు అంటున్నారు. తమకు ఇబ్బంది లేనంత స్థాయిలో స్టాక్‌ను వదిలించుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. అమ్మకాలు తగ్గిన నేపథ్యంలో మారుతి సుజుకి షోరూంలు తెరిచి ఉంచే వేళ సైతం పెరిగింది. విక్రయాల ప్రమోషన్లు కూడా ఎండలో కాకుండా.. సాయంత్రానికి మార్చుతున్నారు. జూన్‌ నెలలో మారుతి అమ్మకాలు 8 శాతం తగ్గాయి. ఇది మొత్తం ఇండస్ట్రీతో పోల్చితే చాలా ఎక్కువ. కేంద్రం పర్యవేక్షణంలో ఉండే వాహన్‌ పోర్టల్‌ లెక్కల ప్రకారం.. ప్యాసింజెర్‌ వెహికల్స్‌ అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే ఏడు శాతం పడిపోయి.. 281,566 యూనిట్లే అమ్ముడు పోయాయి.

Exit mobile version