Site icon vidhaatha

Alliance of India | కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఒకే వేదికపై ఇండియా కూటమి

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు బుధవారం ఒకే వేదికపైకి వచ్చారు. కేజ్రీవాల్‌ను అన్యాయంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం ఢిల్లీలో ఒక సభ నిర్వహించారు. ఇందులో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలందరూ పాల్గొన్నారు. డయాబెటిస్‌తో బాధపడుతున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ ఆరోగ్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రమాదంలోకి నెడుతున్నదని మండిపడ్డారు. ఢిల్లీలో నిరసనలకు కేంద్ర స్థానమైన జంతర్‌మంతర్‌ వద్ద ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈ సభను ఏర్పాటు చేసింది. కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలిపిన ఇండియా కూటమి నేతలు.. కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ అవసరాలకోసం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో ఐక్యంగా ఉంటామని ప్రకటించాయి.

ఇండియా కూటమి, ఆమ్‌ ఆద్మీ నేతలతోపాటు.. కేజ్రీవాల్‌ భార్య సునీత కూడా వేదికపై ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు కీలక ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌ నేతలు ఈ నిరసన కార్యక్రమానికి హాజరయ్యే విషయంలో మొదట కొన్ని అనుమానాలు ఉన్నా.. జాతీయ స్థాయిలో దర్యాప్తు సంస్థల దుర్వినియోగం విషయంలో తన వైఖరికి కట్టుబడిన కాంగ్రెస్‌ పార్టీ.. ఈ నిరసనకు హాజరై, ప్రతిపక్షాల విస్తృత ఐక్యతను చాటింది. రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష ఉప నేత ప్రమోద్‌ తివారి, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష ఉప నేత గౌరవ్‌ గగోయ్‌ ఈ నిరసనలో పాల్గొన్నారు. తమ పార్టీ కీలక నేతల మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ తరఫున తాము ఈ నిరసనలో పాల్గొంటున్నామని తివారి, గగోయ్‌ చెప్పారు. కేజ్రీవాల్‌కు తమ పూర్తి నైతిక మద్దతు ఉంటుందని ప్రకటించారు.
భారీ మెజార్టీతో విజయం సాధించిన ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేశారు. దాన్ని మేం అప్పట్లోనే వ్యతిరేకించాం. ఇప్పుడు కూడా మేం కేజ్రీవాల్‌పక్షాన నిలుస్తున్నాం. నాయకుల అరెస్టుల ద్వారా మమ్మల్ని చీల్చాలని బీజేపీ భావిస్తే అది తప్పే. మేం వారికి లొంగేది లేదు’ అని తివారి చెప్పారు. 56 అంగుళాల ఛాతీ అని చెప్పుకొనే ప్రధాన మంత్రి ఈడీ, సీబీఐ మాటున ఎందుకు నక్కి ఉన్నారు? అని గగోయ్‌ ప్రశ్నించారు. ‘వారు ముఖ్యమంత్రులను అరెస్టు చేశారు. బ్యాంకు ఖాతాలు సీజ్‌ చేశారు. ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగి ఉంటే.. మేం అధికారంలోకి వచ్చి ఉండేవాళ్లం. వారు ప్రతిపక్షంలో కూర్చొని ఉండేవాళ్లు’ అని అన్నారు.

కేజ్రీవాల్‌కు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు. పాలక పార్టీ అధికార కాంక్షను కేజ్రీవాల్‌ అరెస్టు చాటుతున్నదని అన్నారు. ‘కానీ.. ప్రజలు వారికి గుణపాఠం చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ ప్రజలు బీజేపీని ఓడించడమే కాదు.. సమాజ్‌వాది పార్టీకి, ఇండియా కూటమికి ఓట్లేయడం ద్వారా బీజేపీకి మెజార్టీ రాకుండా నిరోధించారు. ప్రధాని గెలిచి ఉండొచ్చు కానీ.. ఓట్ల విషయంలో ఆయన ఓడిపోయారు’ అని అన్నారు.

కేజ్రీవాల్‌, ఇతర ఆప్‌ నేతలను జైల్లో ఉంచడం ద్వారా ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఎన్సీపీ (ఎస్పీ) నేత శరద్‌పవార్‌ విమర్శించారు. ‘అహంభావ నేతలకు ఎలా గుణపాఠం చెప్పాలో ఢిల్లీ ప్రజలకు బాగా తెలుసు. కచ్చితంగా వారు బీజేపీకి గుణపాఠం చెప్పితీరుతారు’ అని పవార్‌ అన్నారు.

బీజేపీ మెజార్టీకి దూరంగా ఉండిపోయి, సంఖ్యాబలంలో 63 మంది ఎంపీలు తగ్గిపోయినా బీజేపీ వైఖరిలో ఎలాంటి మార్పురాలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ‘రాజులం కాదు.. చక్రవర్తులం అన్నట్టు వారి ప్రవర్తన ఉన్నదని అన్నారు. కేజ్రీవాల్‌పై కేసు పూర్తిగా రాజకీయ దురుద్దేశాలతో కూడినదేనని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలను టార్గెట్‌ చేయడం, వారిని వేధించడం, వారి పార్టీలను సంక్షోభంలోకి నెట్టివేసేందుకు ఈడీ, సీబీఐలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాడుకుంటున్న తీరుకు కేజ్రీవాల్‌ అరెస్టు ప్రత్యక్ష ఉదాహరణ అని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. పరిస్థితులు తారుమారవుతాయని, వారు దుర్వినియోగం చేసిన ఇదే ఈడీ, సీబీఐలు వారిని అరెస్టు చేస్తాయని శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ హెచ్చరించారు. రాజ్యసభలో టీఎఎంసీ ఉప నేత సాగరిక ఘోష్‌.. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ.. సునీత కేజ్రీవాల్‌కు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ‘నియంతృత్వానికి వ్యతిరేకంగా ఆప్‌ చేస్తున్న పోరాటంలో టీఎంసీ కలిసి వస్తుంది. సునీత కేజ్రీవాల్‌కు మమత పూర్తి మద్దతు ప్రకటించారు’ అని ఆమె చెప్పారు. పదే పదే ఎమర్జెన్సీ కాలం గురించి మాట్లాడే బీజేపీ.. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు, డీఎంకే నేత తిరుచ్చి ఎన్‌ శివ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version