బంగారం, వెండి సుంకాల పెంపుతో భారత్ కు రూ.10,463కోట్ల ఆదాయం!

బంగారం, వెండి, ప్లాటినమ్ దిగుమతి సుంకాల పెంపుతో మే 13 నుంచి ఆగస్టు 2 మధ్య కేంద్రానికి రూ.10,463 కోట్ల ఆదాయం సమకూరిందని కేంద్రం పార్లమెంట్‌కు వెల్లడించింది. విదేశీ మారక నిల్వల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య విదేవీ మారక నిల్వల పరిరక్షణలో భాగంగా దేశంలో బంగారం, వెండి కొనుగోళ్లను నియంత్రించేందుకు దిగుమతి సుంకాలు సవరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. మే 13 నుంచి ఆగస్టు 2 మధ్య బంగారం, వెండి, ప్లాటినమ్‌పై కస్టమ్స్‌ డ్యూటీ రూపంలో రూ.10,463 కోట్లు వసూలైనట్లు కేంద్రం పార్లమెంట్‌కు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

వెండిపై రూ.328 కోట్లు ప్లాటినమ్‌పై రూ.95 కోట్లు చొప్పున ఆదాయం సమకూరిందని, మూడు లోహాలపై కలిపి రూ.10,463 కోట్లు వచ్చినట్లు మంత్రి వెల్లడించారు. పెరిగిన సుంకాల మూలంగా అదనంగా ఎంత వచ్చిందీ మాత్రం వెల్లడించలేదు. మే 13 నుంచి జూన్‌ 30 మధ్య అక్రమ మార్గంలో తీసుకొస్తున్న 161 కేజీల బంగారం పట్టుబడిందని, 116 మందిని అరెస్ట్‌ చేశారని మంత్రి తెలిపారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హర్మూజ్‌ మూసివేత నేపథ్యంలో క్రూడాయిల్‌ ధరలు భారీగా పెరిగిపోగా, ఇంధనం, ఎరువుల ధరలకూ రెక్కలొచ్చాయి. దీంతో విదేశీ మారకం నిల్వలు కాపాడుకునేందుకు భారత ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతి సుంకాలను పెంచి కొనుగోళ్లు తగ్గించాలని భావించింది. స్వయంగా ప్రధాని మోదీ సైతం బంగారం, వెండి కొనుగోలుకు ప్రజలు కొంతకాలం దూరంగా ఉండాని, ఇదో రకంగా దేశ సేవగా భావించాలని పిలుపునిచ్చారు. బంగారం, వెండి దిగుమతుల నియంత్రణ చర్యలలో భాగంగా బంగారం, వెండిపై 6 శాతంగా ఉన్న కస్టమ్స్‌ సుంకాన్ని మే 13న 15 శాతానికి, ప్లాటినంపైనా 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.

Latest News