కూలిన భారత ఆర్మీ చీతా హెలికాప్టర్..ముగ్గురు క్షేమం

లద్దాఖ్‌లోని లెహ్ సమీపంలో భారత ఆర్మీ చీతా హెలికాప్టర్ కూలినా ఇద్దరు పైలట్లు, మేజర్ జనరల్ సచిన్ మెహతా స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

లద్దాఖ్‌లోని లెహ్ సమీపంలో గల టాంగ్‌స్టేలో భారత ఆర్మీ చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు డివిజన్ కమాండర్ మేజర్ జనరల్ సచిన్ మెహతా తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వీరు స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నారని సైనిక అధికారులు ధ్రువీకరించారు.

కాగా ప్రమాదం తర్వాత తీవ్రంగా దెబ్బతిన్న హెలికాప్టర్ వద్ద మెహతా తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

చీతా, చేతక్ హెలికాప్టర్ల స్థానంలో కొత్త హెలికాప్టర్లు

భారత సాయుధ బలగాల వద్ద ఉన్న అత్యంత పురాతనమైన చీతా, చేతక్ హెలికాప్టర్లు 350వరకు ఉన్నాయి. వీటి డిజైన్ 1960నాటి పాతది. ఆధునిక ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు లేకపోవడంతో ఈ హెలికాప్టర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గతంలో జరిగిన ప్రమాదాల్లో చాలా మంది పైలట్లు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత రెండు దశాబ్దాలుగా ఈ చీతా, చేతక్ హెలికాప్టర్లను కొత్త రకం హెలికాప్టర్లతో భర్తీ చేయాలని సైన్యం డిమాండ్ చేస్తోంది. అందుకే, ఇప్పుడు ఈ పాత హెలికాప్టర్ల స్థానంలో ఆధునిక టెక్నాలజీతో కూడిన కొత్త లైట్ హెలికాప్టర్లను తీసుకొచ్చేందుకు రక్షణ శాఖ సన్నాహాలు చేస్తోంది. పాత చీతా, చేతక్ హెలికాప్టర్ల స్థానంలో కొత్తగా లైట్ హెలికాప్టర్లను తీసుకరాబోతున్నారు. ఈ నేపథ్యంలో, భారత సైన్యం, వాయుసేన కలిసి 200 కొత్త హెలికాప్టర్లను సమకూర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. భారత సైన్యం 120 రెకనైసెన్స్ అండ్ సర్వైలెన్స్ హెలికాప్టర్ల (RSH) కోసం, అలాగే వాయుసేన 80 హెలికాప్టర్ల కోసం రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ (RFI) జారీ చేసింది.

ఇవి కూడా చదవండి :

భూమిలో నుంచి బయటపడిన సింహవాహిని అమ్మవారు
గుంపు మేస్త్రీ హఠావో….తెలంగాణ బచావో : కవిత

Latest News