భూమిలో నుంచి బయటపడిన సింహవాహిని అమ్మవారు

తిరుపతి జిల్లా ఇరంగారిపల్లిలో పొలం తవ్వకాల సమయంలో సింహవాహినిపై ఆసీనులైన పురాతన అమ్మవారి విగ్రహం బయటపడటంతో గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది.

భూమిలో నుంచి బయటపడిన సింహవాహిని అమ్మవారు

తిరుపతి జిల్లా, పాకాల మండలం ఇరంగారిపల్లిలో పొలం తవ్వకాలలో భాగంగా పురాతన అమ్మవారి విగ్రహం బయటపడటం ఆసక్తి రేపింది. ఇరంగారిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలాన్ని చదును చేయించేందుకు జేసీబీతో పనులు చేపట్టాడు. పొలం చుట్టూ కంచె నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో తవ్వకాలు నిర్వహిస్తుండగా జేసీబీకి ఏదో బండరాయిలా గట్టిగా తగలడంతో పనులు నిలిపివేసి పరిశీలించారు. అక్కడ జాగ్రత్తగా మట్టి తొలగించి చూడగా అంతా షాక్ అయ్యారు. సింహవాహనంపై ఆసీనులైన అమ్మవారి పురాతన విగ్రహం భూమి నుంచి దర్శనమిచ్చింది. విగ్రహం ఆకృతి, శిల్పకళను చూసిన స్థానికులు దీన్ని దుర్గాదేవి విగ్రహంగా భావిస్తున్నారు.

విగ్రహం దెబ్బతినకుండా ఉండేందుకు గ్రామస్తులు, కార్మికులు జాగ్రత్తగా వ్యవహరించి.. తాళ్లు కట్టి జేసీబీ సహాయంతో విగ్రహాన్ని బయటకు తీశారు. అనంతరం పొలంలోనే ఒక ప్రదేశంలో ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించారు. దుర్గాదేవి అమ్మవారే ప్రత్యక్షమయ్యారనే భావనతో గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కొందరు ఈ ప్రాంతాన్ని పురాతన దేవాలయ ఆనవాళ్లుగా భావిస్తుండగా, మరికొందరు చారిత్రక ప్రాధాన్యత కలిగిన విగ్రహంగా చెబుతున్నారు. సింహ వాహిని అమ్మవారి విగ్రహాన్ని చూసేందుకు భక్తులతో పాటు ఆసక్తిగా ప్రజలు కూడా తరలివస్తుండటంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. పురావస్తు అధికారులు విగ్రహాన్ని పరిశీలించి ఇతర వివరాలను వెల్లడిస్తేగాని విగ్రహ చరిత్ర, ప్రాధాన్యత తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

గుంపు మేస్త్రీ హఠావో….తెలంగాణ బచావో : కవిత
పోలీస్ ఫిర్యాదులకు బహుభాషా ‘ఏఐ కాప్‌రైట‌ర్’ యాప్