పోలీస్ ఫిర్యాదులకు బహుభాషా ‘ఏఐ కాప్‌రైట‌ర్’ యాప్

హైదరాబాద్ పోలీసులు ‘ఏఐ కాప్‌రైట‌ర్’ యాప్‌ను ప్రారంభించారు. భాష ఏదైనా ఫిర్యాదును వెంటనే నమోదు చేసి అనువదించే ఈ ఏఐ యాప్ దేశంలోనే తొలి మల్టీలింగ్వల్ పోలీస్ కంప్లైంట్ సిస్టమ్‌గా నిలిచింది.

పోలీస్ ఫిర్యాదులకు బహుభాషా ‘ఏఐ కాప్‌రైట‌ర్’ యాప్

భాష ఏదైనా.. ఫిర్యాదు ఇక సులభం
హైదరాబాద్ పోలీసుల అమ్ములపొదిలోకి ‘ఏఐ కాప్‌రైట‌ర్’
దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత బహుభాషా ఫిర్యాదుల నమోదు
యాప్ ను ఆవిష్కరించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్

పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భాషా పరమైన ఇబ్బందులు కలగకుండా, వారి ఫిర్యాదులను త్వరితగతిన, కచ్చితత్వంతో నమోదు చేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఏఐ కాప్‌రైట‌ర్ అనే కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలో శనివారం ఏఐ కాప్‌రైట‌ర్ యాప్ ను హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించారు. దాని ప‌నితీరును ప‌రిశీలించారు.

తొలుత నగరంలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో అమలు

నగరంలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో తొలుత అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా, బాధితులు తమ మాతృభాషలో చెప్పే ఫిర్యాదులను పోలీసులు తక్షణమే రికార్డు చేసి, అనువదించుకోవచ్చు. హైదరాబాద్ వంటి మెట్రో నగరంలో తెలుగు, ఇంగ్లీష్ రాని ఇతర రాష్ట్రాల వలస కార్మికులు, పర్యాటకులు ఫిర్యాదు చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భాష అర్థం కాక ఎఫ్.ఐ.ఆర్ నమోదులో జాప్యం జరగడం, సమాచారం తప్పుగా నమోదవ్వడం వంటి సమస్యలకు ఈ యాప్ స్వస్తి పలకనుంది.
10కి పైగా ప్రధాన భారతీయ భాషలను గుర్తించే సామర్థ్యం ఈ యాప్ సొంతం. ఈ వినూత్న యాప్ ను బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ సంస్థతో పాటు ఇంటర్న్ పాగ్రో చందు సహకారంతో హైద‌రాబాద్ సిటీ పోలీస్ రూపొందించింది.

ప్ర‌ధాన అంశాలు:

బహుభాషా సౌలభ్యం: హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి 10 భాషల్లో మాట్లాడితే, అది వెంటనే రాతపూర్వక రూపంలోకి మారి, పోలీసులకు అర్థమయ్యే భాషలోకి అనువదించబడుతుంది.

వేగం-కచ్చితత్వం: గంటల తరబడి పట్టే ఫిర్యాదు ప్రక్రియను కేవలం సెకన్లలోనే పూర్తి చేయవచ్చు. అనువాదకుల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు.

పారదర్శకత: ఫిర్యాదు రికార్డ్ చేసిన అధికారి వివరాలు, సమయం వంటివి ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ రూపంలో నిక్షిప్తమవుతాయి. దీనివల్ల రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉండదు.

మల్టీ-పార్టీ లేబులింగ్: బాధితుడు, నిందితుడు లేదా సాక్షులు మాట్లాడే మాటలను వేర్వేరుగా గుర్తించి రికార్డ్ చేస్తుంది.

నగర పోలీసింగ్‌లో కృత్రిమ మేధ జోరు:

ఆధునిక పోలీసింగ్ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఏఐని విస్తృతంగా వినియోగిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ పనితీరులో మరింత సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో టెక్నాలజీ ఆధారిత పాలనకు ప్రాధాన్యతనిస్తోంది.

ఇందులో భాగంగానే.. సైబర్ క్రైమ్ ఫిర్యాదులను పక్కాగా రూపొందించడానికి ఇప్పటికే ‘సి-మిత్ర’ లో ఏఐ సాంకేతికతను పోలీస్ శాఖ విజయవంతంగా అమలు చేస్తోంది. అలాగే సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందికి విధులను కేటాయించే ప్రక్రియలో ఏఐను వాడుతోంది. గతంలో ఉన్న మ్యాన్యువల్ పద్ధతుల స్థానంలో ప్రవేశపెట్టిన ఈ ఆటోమేటెడ్ విధానం వల్ల, ఎటువంటి పక్షపాతం లేకుండా సిబ్బందికి పోస్టింగ్‌లు కేటాయించబడుతున్నాయి. ఇది వ్యవస్థలో పూర్తి పారదర్శకతను పెంచుతోంది.

అమలులో ‘సాక్-ఐ’ అనే ఏఐ ఆధారిత యాప్

సోషల్ మీడియాలో సమాజ శాంతికి భంగం కలిగించే అంశాలను గుర్తించేందుకు ‘సాక్-ఐ’ అనే ఏఐ ఆధారిత యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఆన్‌లైన్ కంటెంట్‌ను నిరంతరం పర్యవేక్షించడమే కాకుండా, మహిళల, చిన్నారుల భద్రతకు విఘాతం కలిగించే పోస్టులను కనిపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఫిర్యాదుల నమోదు ప్రక్రియను కూడా ఏఐతో అనుసంధానించింది. అందుకు ఏఐ కాప్‌రైట‌ర్ యాప్ ను రూపొందించింది. దీనివల్ల ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు మరింత వేగంగా, క్రమబద్ధంగా నమోదవుతాయి.

పోలీసింగ్ వ్యవస్థలో ఏఐ వినియోగం గర్వకారణం: సజ్జనార్

పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఏఐ ఆధారిత మల్టీలింగ్వల్ కంప్లైంట్ రికార్డర్‌ను అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణమని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ అన్నారు.

“హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ కావడంతో ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ రాని వలసవచ్చిన ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు ఎందరో ఉంటారు. భాష తెలియకపోవడం వల్ల ఫిర్యాదు చేయడంలో జాప్యం జరగడం లేదా సమాచారం తప్పుగా నమోదు కావడం వంటి సమస్యలకు ఈ యాప్ చెక్ పెట్టనుంది. బాధితుడు తన మాతృభాషలో మాట్లాడితే, ఈ యాప్ దానిని వెంటనే గుర్తించి, అనువదించి, అధికారిక రికార్డుగా మారుస్తుంది. మాట్లాడిన ప్రతి 5 సెకన్లకు సమాచారం అప్‌డేట్ అవుతుంది. ఈ సాంకేతికత వల్ల ముఖ్యంగా వలస కార్మికులు, మహిళలు, వృద్ధులకు పోలీసు సేవలపై భరోసా పెరుగుతుంది. బాధితులు చెప్పే ప్రతి మాటను యథాతథంగా నమోదు చేయడం వల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగి, తద్వారా నిందితులకు శిక్ష పడే అవకాశాలు మెరుగుపడతాయి. దీనివల్ల పోలీసు అధికారులకు టైపింగ్ భారం తగ్గడమే కాకుండా, రికార్డుల నిర్వహణ పద్ధతి ఏకరీతిగా ఉంటుంది.” అని ఆయన తెలిపారు.

‘స్మార్ట్ పోలీసింగ్’తో మెరుగైన సేవలు

న్యాయం పొందడానికి భాష ఎప్పటికీ అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ ఏఐ కాప్‌రైట‌ర్ ఆధునిక పోలీసింగ్‌లో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని సజ్జనార్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ‘స్మార్ట్ పోలీసింగ్’ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించడమే హైదరాబాద్ సిటీ పోలీస్ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో అద‌న‌పు సీపీ(క్రైమ్స్ అండ్ సిట్) ఎం.శ్రీనివాసులు, అద‌నపు సీపీ(లా అండ్ ఆర్డ‌ర్) త‌ఫ్సీర్ ఇక్బాల్, డీసీపీ (ఎస్ఎమ్ఐటీ) సీహెచ్ రూపేష్, ఐపీఎస్, ఐటీ సెల్ ఇన్స్పెక్ట‌ర్ ర‌మేశ్, బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ ప్ర‌తినిధులు, త‌దితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

చైనా బొగ్గు గనిలో పేలుడు…82మంది దుర్మరణం
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, దిగుతూ మృతిచెందిన హైదరాబాద్ పర్వతారోహకుడు..