కల్తీ మామిడి పండ్లు వస్తున్నాయ్.. తస్మాత్ జాగ్రత్త!

కల్తీ మామిడి పండ్లపై పోలీసుల హెచ్చరిక. రసాయనాలతో మగ్గించిన పండ్లు ఆరోగ్యానికి హానికరం. జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని సజ్జనార్ సూచించారు.

కల్తీ మామిడి పండ్లు వస్తున్నాయ్.. తస్మాత్ జాగ్రత్త!

విధాత : కల్తీ…పాలల్లో కల్తీ..నీళ్లలో కల్తీ, వంట నూనెలు..నెయ్యి, వెల్లుల్లి, ఉస్మానియా బిస్కెట్ సహా తినే ఆహారంలో,వేసుకునే మందుల్లో , సబ్బుల్లో కూడా కల్తీ..అంతా కల్తీ మయం. ఇప్పుడు వేసవిలో సీజనల్ గా వచ్చే మామిడి పండ్లలోనూ కల్తీ పండ్లు వస్తున్నాయట…ఇదెవరో సామాన్యులు చెప్పింది కాదండోయ్..ఏకంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ వార్నింగ్.

వేసవి కాలంలో పండ్లలో రారాజు మామిడి మార్కెట్‌లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితేనోరూరించే మామిడి ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయని.. కాసుల కక్కుర్తితో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ పండ్లను కల్తీ చేస్తున్నారంటూ సజ్జనార్ ఎక్స్ వేదికగా హెచ్చరిస్తున్నారు.

సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడి పండ్లను కాల్షియం కార్బైడ్‌, ఇతర ర‌సాయాల‌ను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారని… రోడ్డు పక్కన బండ్ల మీద నిగనిగలాడుతూ, పసిడి వర్ణంతో కంటికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండునూ నాణ్యమైనదిగా భావించి కొనుగోలు చేయడం అంటే.. అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమేనంటూ అప్రమత్తం చేశారు.

సాధారణంగా సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదు, కానీ రసాయనాలతో మగ్గించిన పండ్లు పైన పసుపు పచ్చగా ఉండి, లోపల మాత్రం పచ్చిగా ఉండి విషతుల్యంగా మారుతాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల గొంతు మంట, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు వంటి తక్షణ సమస్యలతో పాటు, దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారని గుర్తు చేశారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ వ్యాపారుల పట్ల హైదరాబాద్ పోలీస్ విభాగం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతోంది. కల్తీ మామిడి పండ్లపైనా హెచ్‌-ఫాస్ట్ నిఘా ఉంచుతోంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ప్రజలు రూపాన్ని చూసి మోసపోకుండా, సహజత్వాన్ని గుర్తించి పండ్లను కొనుగోలు చేయాలని సజ్జనార్ వెల్లడించారు.

సహజంగా పండిన పండ్ల కంటే అసహజమైన రంగు, రసాయన వాసన, వింత రుచి కలిగిన మామిడి పండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, పండ్లపై అసాధారణ మచ్చలున్నా లేదా బేకింగ్ సోడా నీటిలో కడిగినప్పుడు రంగు మారినా అవి ఆరోగ్యానికి హానికరమని గ్రహించాలని తెలిపారు. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ ఫోన్ నంబ‌ర్ 8712661212కు స‌మాచారం ఇవ్వండని సూచించారు.

ఇవి కూడా చదవండి :

వీళ్ల పాలన పాడుగాను.. బీపీ లేస్తుంది: కాంగ్రెస్ పాలనపై కూనంనేని ఫైర్
Cumin | శుక్ర‌వారం జీల‌క‌ర్ర దానం చేయండి..! ఆర్థిక స్థిర‌త్వం పొందండి..!!