ISRO | మానవులను అంతరిక్షంలోకి పంపి.. సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడమే ఇస్రో లక్ష్యమని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోని ఓ పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇస్రో భవిష్యత్తు ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్ మిషన్ విజయవంతమైందని తెలిపారు. ఈ విజయవంతమైన మిషన్ తర్వాత ప్రపంచం మన వైపు చూస్తోందని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు. కొత్త విధానంతో ప్రైవేటు రంగంలో కూడా అంతరిక్షంలో పని చేసే అవకాశం ఉంటుందన్నారు. తాము 2020లో అంతరిక్ష చట్ట సవరణను ప్రకటించామన్నారు. ప్రభుత్వం కొత్త ఇండియన్ స్పేస్ పాలసీ 2023ని కూడా ప్రకటించిందని చెప్పారు.
దాంతో ప్రైవేట్ కంపెనీలు, సంస్థలు అంతరిక్ష రంగంలో కలిసి పని చేయగలవన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం పెరుగుతుందని, అంతరిక్ష రంగంలో సంస్థాగతంగా కృషి జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. భవిష్యత్తులో అంతరిక్ష రంగంలో మనం ఏం చేయాలనుకుంటున్నామో దానికి ప్రభుత్వం కొత్త విజన్ ఇచ్చిందన్నారు. ఇదంతా చాలా ఉత్తేజకరమైందని.. అంతరిక్షంలో మానవ కార్యకలాపాల గురించి తెలుసుకోగలగడంతో పాటు అంతరిక్ష కేంద్రాలను సైతం నిర్మించగలమన్నారు. అంతరిక్ష రంగంలో ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరుగుతాయని.. ఉపాధి, పరిశ్రమలు, స్టార్టప్‌లకు అవకాశాలను సృష్టిస్తుందన్నారు. ప్రభుత్వం అంతరిక్ష రంగంలో అనేక సంస్కరణలు చేసిందని.. ఇది ప్రైవేట్ కంపెనీలకు ఈ రంగంలోకి ప్రవేశించడానికి బాటలు వేసిందని.. ఈ సంస్కరణలు అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో సహాయపడుతాయని ఇస్రో చైర్మన్ వివరించారు.