బిహార్ లో ఘోర ఓటమితో
ప్రశాంత్ కిశోర్ ఆశ్రమ జీవితం
వచ్చే ఐదేళ్లు అక్కడే నివాసం
విధాత, హైదరాబాద్: ఎన్నో పార్టీలకు అధికారంలోకి తీసుకువచ్చి కింగ్ మేకర్ గా ప్రచారం పొందారు. కింగ్ మేకర్ గా పిలిపించుకున్న ఆయనలో స్వార్థం పెరిగి తానే కింగ్ అయిపోతే పోలా అని ఒక రాజకీయ పార్టీని ప్రారంభించారు. మొన్న జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బొక్క బోర్లా పడ్డాడు. ఒక్క సీటంటే ఒక్కటి కూడా గెలవలేకపోవడంతో జనం ముందు నవ్వులపాలయ్యారు. ఆయనే ప్రశాంత్ కిశోర్. రాజకీయ పార్టీలు ఆయనను పీకే గా, ఎన్నికల వ్యూహకర్తగా పిలుస్తాయి. బిహార్ ఓటమి తరువాత ఆయనకు రాజకీయాలు అంటే పూర్తిగా బోధపడడంతో తాత్కాలికంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే ఐదేళ్లు ఆశ్రమ జీవితం గడుపుతానని స్పష్టం చేశారు. ఎన్నికల వ్యూహాలు వేరు, రాజకీయం వేర్వేరు అంశాలు అనే విషయాన్ని గమనించలేక భంగపాటుకు గురయ్యారు. మొత్తానికి ఏదైతేనేమీ వచ్చే ఐదు సంవత్సరాల పాటు రాజకీయ సన్యాసం తీసుకోనున్నట్లు పీకే ప్రకటించారు.
బిహార్ లోని రోహతాస్ జిల్లాలోని కన్యాకుబ్జు బ్రాహ్మణ కులానికి చెందిన ప్రశాంత్ కిశోర్ బక్సర్ లో సెకండరీ విద్య, హైదరాబాద్ లో ఇంజినీరింగ్ లో గ్రాడ్యుకేషన్ పూర్తి చేశారు. తన ఉద్యోగ జీవితాన్ని ఐక్యరాజ్య సమితి (యూఎన్ఓ) సాయం అందిస్తున్న ప్రజారోగ్య విభాగంలో ప్రారంభించారు. 2011 వరకు సుమారు 8 సంవత్సరాల పాటు పనిచేసి, ఆ తరువాత ఎన్నికల వ్యూహకర్త అవతారం ఎత్తారు. ఆ తరువాత అప్పటి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ బృందంలో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం తనదైన వ్యూహాలను అమలు చేశారు. సోషల్ మీడియా లో పబ్లిసిటీ కోసం 2013 లో సిటిజన్స్ ఫర్ అక్కౌంటేబుల్ గవర్నర్స్ (సీఏజీ) ను ప్రారంభించారు.
2014 లో నరేంద్ర మోదీ తరఫున ప్రచార వ్యూహాలను రూపొందించారు. ఛాయ్ పే చర్చా, త్రీ డీ ర్యాలీలు, మంథన్ వంటి పలు ప్రచార కార్యక్రమాలను అమలు చేసి బీజేపీని కేంద్రంలో అధికారంలోకి వచ్చేలా చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తించి ప్రజలను బీజేపీ వైపు మళ్లేలా చేయడంలో విజయవంతం అయ్యారు. 2015, 2020 లో బిహార్ లో నితీష్ కు, 2017లో ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ కు వ్యూహకర్తగా వ్యవహరించారు. ఇలా పంజాబ్ లో కాంగ్రెస్ కు, ఏపీ లో వైఎస్ఆర్ కాంగ్రెస్, ఢిల్లీలో ఆప్, పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే కు పనిచేశారు. పనిచేసిన రాష్ట్రాలలో పార్టీలను విజయ తీరాలకు తీసుకువెళ్లడంలో ఫెయిల్ అయ్యారు. 2021 లో రాజకీయాల నుంచి విరమించుకున్నట్లు ప్రకటించి జనతాదళ్ పార్టీలో చేరారు. జనతాదళ్ అధినేత నితీష్ కుమార్ తో విభేధించి బయటకు వచ్చి జన సురాజ్ పార్టీని 2024లో ప్రారంభించి ఎన్నికల బరిలోకి దిగారు. అదే సంవత్సరం చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలబెట్టిన ఆయన మాత్రం ఎక్కడా పోటీ చేయకుండా ప్రచారానికే పరిమితం అయ్యారు. ఒక్క సీటును కూడా కైవసం చేసుకోలేక చతికిలపడిపోయి జనం ముందు నవ్వుల పాలయ్యారు. ఆ తరువాత నుంచి తత్వం బోధపడి తన దారి ఏంటనేది నిర్ణయించుకునే స్థాయికి వచ్చారు. జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ లు తనను దూరం పెట్టడం, ప్రాంతీయ పార్టీల నుంచి కూడా ఆశించిన విధంగా సహకారం లేకపోవడం వంటి కారణాలు కూడా ఆశ్రమ జీవితం వైపు మళ్లించాయంటున్నారు.
బిహార్ రాష్ట్ర రాజధాని పట్నా శివారులో బిహార్ నవనిర్మాణ్ ఆశ్రమం ఉంది. రెండు రోజుల క్రితం ఆయన తన ఇంటి నుంచి మూటాముళ్లె సర్థుకుని ఆశ్రమానికి వెళ్లిపోయారు. 2031లో బిహార్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల వరకు అక్కడే ఉంటానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల నాటికి జన సురాజ్ పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. ఆశ్రమంలో ఉంటూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి సంసిద్ధం చేస్తానని పేర్కొన్నారు. బిహారీలు ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ను ఎన్నుకుంటే, ఆ పని చేయకుండా రాష్ట్రం నుంచి వెళ్లిపోయారని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన పథకం కింద రాష్ట్రంలో 1.5 కోట్ల మంది మహిళలకు రూ.10వేల చొప్పున బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారన్నారు. నాయకులు ఇచ్చే తాయిలాలకు ఆశపడి తమ విలువైన ఓటు హక్కును దుర్వినియోగం చేయవద్దని బిహార్ మహిళలను పీకే కోరారు.
ఇవి కూడా చదవండి :
మరిన్ని ప్రభుత్వ భూముల అమ్మకానికి రేవంత్ రెడ్డి సర్కార్ సన్నద్ధం
యూఏఈ క్వీన్ మదర్‌కు కరీంనగర్ ఫిలిగ్రీ బాక్స్ కానుక
