భారతదేశంలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తి అదుపులో ఉన్నప్పటికి ప్రపంచంలో అత్యధికంగా హెచ్‌ఐవీ బాధితులు ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. దేశంలో సుమారు 2.4 మిలియన్ల మంది ఈ వ్యాధితో జీవిస్తున్నారు. 15 నుండి 49 సంవత్సరాల వయస్సు గల వారిలో హెచ్‌ఐవీ ప్రాబల్యం సుమారు 0.2% ఉన్నట్లుగా గణంకాలు వెల్లడిస్తున్నాయి. వార్షికంగా కొత్తగా హెచ్‌ఐవీ సోకుతున్న వారి సంఖ్య దాదాపు 64,000 వరకు అంచనా వేయబడింది. దేశంలోని కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, ప్రధాన పట్టణాల్లో హెచ్ఐవీ కేసులు అధికంగా నమోదవుతున్నట్లు ప్రభుత్వ నివేదికలు తెలుపుతున్నాయి.
కర్ణాటకలో హెచ్ఐవీ కలకలం
హెచ్ఐవీ పాజిటివ్ కేసులకు సంబంధించి కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల వెల్లడైన ఓ నివేదిక కలకలం రేపింది. రాష్ట్రంలో యువత, ముఖ్యంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో హెచ్‌ఐవీ బారిన పడుతున్నట్లు ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వేల్లో బహిర్గతమవ్వడం సంచలనం రేపింది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఆరోగ్య పరీక్షల శిబిరాలలో భాగంగా సేకరించిన నమూనాలను విశ్లేషించగా, రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 7,000 మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలడం ప్రభుత్వాన్ని నివ్వెరపరిచింది. చిన్న వయస్సులోనే వేలాది మంది విద్యార్థులు ఈ మహమ్మారి బారిన పడటం పట్ల ఆరోగ్య నిపుణులు, తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నివేదికల ప్రకారం.. అసురక్షిత లైంగిక సంబంధాలు, మాదకద్రవ్యాల వాడకం హెచ్‌ఐవి కేసుల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా తేలింది. అందుకే ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి, అది తీవ్రరూపం దాల్చకుండా నివారించేందుకు కాలేజీ విద్యార్థులకు హెచ్‌ఐవి పరీక్షలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.
దేశంలో మూడో స్థానంలో కర్ణాటక
జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) నివేదికల ప్రకారం హెచ్‌ఐవీ బాధితుల సంఖ్యలో కర్ణాటక దేశంలో మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 2,60,000 మంది హెచ్‌ఐవితో జీవిస్తుండగా, వీరిలో, సుమారు 56,406 మందికి తమ హెచ్ఐవీ వ్యాధి ఉందన్న సంగతి తెలియకుండానే జీవిస్తుండటం విస్మయకరం. హెచ్ఐవీ సోకిన వారిలో 2,05,000 మంది చికిత్స పొందుతున్నారు. 18 నుండి 35 సంవత్సరాల వయసు గల వారిలో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. 2023-24లో ఈ వయస్సు వర్గంలో 44,500 మందికి హెచ్‌ఐవి ఉన్నట్లు నిర్ధారణ కాగా, ఈ సంఖ్య 2025-26 నాటికి 66వేలకు పెరుగుతుందని అంచనా. ప్రత్యేకించి 18 – 25 ఏళ్ల వయసున్న 7,000 మందికి పైగా విద్యార్థులు పాజిటివ్‌గా తేలడం ఆందోళన రేపుతుంది.
నియంత్రణకు స్పెషల్ డ్రైవ్..
విద్యార్ధులలో భారీ సంఖ్యలో హెచ్ఐవీ కేసులు వెల్లడవ్వడంతో అప్రమత్తమైన కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో హెచ్‌ఐవీ వ్యాప్తిని ప్రాథమిక దశలోనే అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థల్లో ఉచిత ఎయిడ్స్ పరీక్షా శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపులతో పాటు, హెచ్‌ఐవీ వ్యాప్తి చెందే మార్గాలు, నివారణ మార్గాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆరోగ్య శాఖకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
ముంబై నగరంలోనూ అదే తీవ్రత..
ప్రాణాంతక హెచ్ఐవీ, ఎయిడ్స్ దేశ వాణిజ్య రాజధానిగా భావించే మహారాష్ట్ర ముంబై నగరంలోనూ వేగంగా విస్తరిస్తుంది. ప్రాణాంతక హెచ్ఐవీ, ఎయిడ్స్ ను నిర్ములించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికి ముంబైలో వ్యాధి పీడితులు, మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. గడచిన నాలుగేళ్ల(2022-26)లో ఎయిడ్స్‌తో మృతిచెందినవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఏకంగా 4,160 మంది ప్రాణాలు కోల్పోయారు. 2022–23తో పోలిస్తే 2025–26లో ఎయిడ్స్‌తో మృతి చెందిన రోగుల శాతం 19.83గా నమోదైంది. గత రెండేళ్లలో వేయికిపైగా రోగులు మృతిచెందినట్లు ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది.హెచ్‌ఐవీ, ఎయిడ్స్ మృతుల సంఖ్యను నియంత్రించేందుకు ఆరోగ్య శాఖ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అవగాహనా, ప్రచార కార్యక్రమాలను ఉధృతం చేసింది. అయినా రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (న్యాకో) వెల్లడించింది.
